ETV Bharat / bharat

ఇస్లాం, క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేం.. సుప్రీంకు కేంద్రం స్పష్టం

author img

By

Published : Dec 8, 2022, 6:45 AM IST

Updated : Dec 8, 2022, 8:35 AM IST

ఇస్లాం, క్రైస్తవంలో చేరిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించే విషయంలో కేంద్ర ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

supreme court
సుప్రీం కోర్టు

మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇస్లాం, క్రైస్తవంలో చేరిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఆ రెండు మతాల్లో అస్పృశ్యత ప్రబలంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. క్రైస్తవ, ముస్లిం మతాల్లో చేరే దళితులనూ ఎస్సీల జాబితాలో చేర్చాలంటూ జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్ర కమిషన్‌ గతంలో ఇచ్చిన నివేదికను తాము ఆమోదించలేదని వెల్లడించింది. ఆ నివేదిక లోపభూయిష్ఠంగా ఉందని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధం మినహా మరే మతంలోని వ్యక్తులనూ ఎస్సీలుగా పరిగణించకూడదని రాజ్యాంగ (ఎస్సీ) ఉత్తర్వు-1950 స్పష్టం చేస్తోంది. అది వివక్షాపూరితంగా ఉందని.. రాజ్యాంగంలోని 14, 15వ అధికరణాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

పిటిషన్‌దారుల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ.. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించే విషయాన్ని పరిశీలించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ కమిషన్‌ను ఏర్పాటుచేసిన సంగతిని గుర్తుచేశారు. అది రెండేళ్లలోగా నివేదిక సమర్పించనుందని తెలిపారు. . కొత్త కమిషన్‌ను ఏర్పాటుచేసిన విషయం వాస్తవమేనని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో తదుపరి విచారణను వచ్చే నెలకు ధర్మాసనం వాయిదా వేసింది.

ధ్రువీకృత వివరాల్లేవు
మరోవైపు, రాజ్యాంగ (ఎస్సీ) ఉత్తర్వు-1950 రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. కొన్ని హిందూ కులాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురయ్యేందుకు కారణమైన అస్పృశ్యత క్రైస్తవంలోగానీ, ఇస్లాంలోగానీ ఎక్కువగా లేదని తెలిపింది. వందల ఏళ్లపాటు హిందూ సమాజంలో ఉన్న అలాంటి అణచివేత వ్యవస్థ ఆ రెండు మతాల్లో కూడా ఉందని చెప్పేందుకు ధ్రువీకృత వివరాలేవీ అందుబాటులో లేవని పేర్కొంది. నిజానికి అస్పృశ్యత/అంటరానితనం నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశంతోనే ఎస్సీలు ఇస్లాం/క్రైస్తవంలోకి మారుతున్నారని వెల్లడించింది.

అలా మతం మారడం ద్వారా తమ సామాజిక హోదాను మెరుగుపర్చుకున్నట్లు వారు భావిస్తున్నప్పుడు.. మళ్లీ అస్పృశ్యత కారణంగా వెనుకబాటుకు గురవుతున్నట్లు చెప్పుకోవడం సముచితం కాదని పేర్కొంది. క్షేత్రస్థాయి అధ్యయనాలు చేపట్టకుండానే సమర్పించడంతో జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్ర కమిషన్‌ నివేదిక తప్పులతడకగా ఉందని, దాన్ని తాము అంగీకరించలేదని వివరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరులోనే సర్వోన్నత న్యాయస్థానంలో తమ స్పందన దాఖలు చేయడం గమనార్హం.

Last Updated : Dec 8, 2022, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.