ETV Bharat / bharat

కేరళ, కర్ణాటక హైకోర్టులకు 12 మంది శాశ్వత న్యాయమూర్తులు

author img

By

Published : Sep 9, 2021, 7:25 AM IST

supreme court
supreme court

పలు రాష్ట్రాల అదనపు జడ్జీలకు పదోన్నతులు కల్పిస్తూ సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ల ధర్మాసనం హైకోర్టుల ప్రతిపాదనలను కేంద్రానికి సిఫార్సు చేసింది.

కేరళ, కర్ణాటక హైకోర్టుల్లో ప్రస్తుతం అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న 12 మందిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌లతో కూడిన కొలీజియం ఆయా హైకోర్టులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ న్యాయమూర్తుల్లో ఇద్దరు కేరళ హైకోర్టు, 10 మంది కర్ణాటక హైకోర్టుకు చెందినవారున్నారు.

ఆ నోటీసుపై 'సుప్రీం'లో యూపీ అప్పీలు..

ట్విట్టర్‌ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. "విషయం ఏమిటి?" అని ధర్మాసనం ప్రశ్నించగా ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేసు పూర్వాపరాలను వివరించారు. మతపరంగా సున్నితమైన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పటి ట్విట్టర్‌ భారత దేశ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరికి సమన్లు పంపించింది.

దిల్లీ శివారులో ఉన్న లోని బోర్డర్‌ పోలీసు స్టేషన్‌కు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని గాజియాబాద్‌ పోలీసులు నోటీసు పంపించారు. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా దానిని జులై 23న కొట్టివేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసుల తీరు దురుద్దేశపూరితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఆయనకు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఈ సెక్షన్‌ కింద నోటీసు ఇస్తే నిందితుడు పోలీసుల ముందు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. పోలీసులకు సహకరిస్తే ఆయనను అరెస్టు చేయకుండా విడిచిపెడతారు. దీనిపై హైకోర్టు ఆదేశాలు ఇస్తూ "సెక్షన్‌ 41(ఏ)ను వేధింపులకు సాధనంగా ఉపయోగించుకోవడాన్ని అనుమతించం.

ఈ వీడియోతో మనీశ్‌ మహేశ్వరికి సంబంధం ఉందని కనీసం ప్రాథమిక ఆధారాలను కూడా సమర్పించలేదు" అని పేర్కొంది. దీనికి బదులు సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇచ్చి వర్చువల్‌ విధానంలోగానీ, బెంగళూరులోని ఆయన ఇంటికో, కార్యాలయానికో వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది. దీన్నే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సవాలు చేసింది. పరిశీలించి, తేదీని నిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం మనీశ్‌ మహేశ్వరిని ట్విట్టర్‌ సంస్థ అమెరికాకు బదిలీ చేయడం గమనార్హం.

ఇవీ చదవండి:

'వృద్ధుడిపై దాడి' ఘటనపై రాజకీయ దుమారం

ట్విట్టర్‌ ఇండియా ఎండీకి హైకోర్టులో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.