ETV Bharat / bharat

'వృద్ధుడిపై దాడి' ఘటనపై రాజకీయ దుమారం

author img

By

Published : Jun 16, 2021, 5:47 AM IST

Updated : Jun 20, 2021, 11:12 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో వృద్ధుడైన ఓ ముస్లిం వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేసి.. అతని గడ్డాన్ని కత్తిరించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది. అంతేగాక జై శ్రీరామ్​ నినాదాలు చేయాలంటూ ఆ వృద్ధుడిని బలవంతం చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది.

Rahul Gandhi
రాహుల్

ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లో ఓ ముస్లిం వ్యక్తిపై నలుగురు యువకులు దాడి చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ట్విట్టర్​లో ఒక క్లిప్పింగ్​ను షేర్​ చేసిన రాహుల్.. ప్రజలను అపఖ్యాతిపాలు చేస్తూ, అవమానించే విధానాలను ప్రభుత్వం మానుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు సూచించారు.

"రాముడి నిజమైన భక్తులు ఇలాంటి పని చేస్తారంటే అంగీకరించలేకపోతున్నా. ఇంతటి క్రూరత్వం మానవత్వానికి చాలా దూరం. ఈ ఘటన సమాజం, మతం అనే భావనలకు సిగ్గుచేటు కలిగించేలా ఉంది."

-రాహుల్ గాంధీ ట్వీట్

రాహుల్​ ట్వీట్​పై స్పందించిన యూపీ సీఎం ఆదిత్యనాథ్.. 'పోలీసులు వాస్తవాలు వెల్లడించినప్పటికీ ఈ ఘటనపై విషం చిమ్ముతున్నందుకు రాహుల్ సిగ్గుపడాలి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"రాముడి భక్తులు పాటించాల్సిన మొదటి సూత్రం సత్యం పలకడం. అది మీరు జీవితంలో ఎన్నడూ చేయలేదు. అధికారంలోకి రావాలనే దురాశతో.. మానవత్వమే సిగ్గుపడేలా చేస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్ ప్రజలను అవమానించడం, వారి పరువు తీయడం మానుకోవాలి."

-యోగి ఆదిత్యనాథ్

ఇదీ చదవండి: 'టీకా పంపిణీ విధానమే సరిగా లేదు'

ఇదీ చదవండి: Vaccine: 'ఉచితం అంటూ.. వసూళ్లు ఏంటి?'

వివాదానికి కారణమిదే..

గాజియాబాద్​కు చెందిన సూఫీ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వృద్ధుడిని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొడుతూ, గడ్డం కత్తిరిస్తూ 'జై శ్రీ రామ్' నినాదాలు చేయాలని బెదిరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మరోవైపు సదరు వృద్ధుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన గడ్డం కత్తిరించిన విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే.. 'జై శ్రీ రామ్' నినాదాలు చేయాల్సిందిగా బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు.

'దాడికి కారణం వేరు..'

మతపరమైన కోణంలో ఈ దాడి జరిగిందన్న వాదనను గాజియాబాద్ పోలీసులు తోసిపుచ్చారు. సూఫీ అబ్దుల్ సమద్ అనే వృద్ధుడి వద్ద తాయత్తులు తీసుకున్న హిందూ-ముస్లిం వర్గాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల బృందం ఈ దాడికి పాల్పడిందని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ అవ్వకుండా ట్విట్టర్ చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ.. ఆ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

"వివిధ రకాల జబ్బులను నయం చేస్తానని చెప్పి సమద్.. తాయత్తులు విక్రయిస్తూంటాడు. ఈ క్రమంలోనే రోగాల బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం గుర్జర్‌ అనే వ్యక్తి కొన్ని తాయత్తులను కొన్నాడు. ఆశించిన ఫలితం రాలేదనే కోపంలో ఇతరులతో కలసి దాడికి దిగాడు."

-ఇరాజ్ రాజా, ఎస్పీ

ఈ ఘటనకు కారణమైన యువకులను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్వేష్ గుర్జర్​తో పాటు.. కల్లూ, ఆదిల్‌ పాలీ, ఆరిఫ్, ముషాహిద్​లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి: 'రాముడి పేరున అక్రమాలు సరికాదు'

'అబద్ధాలు ప్రచారం చేసే రహస్య మంత్రిత్వ శాఖ'

Last Updated :Jun 20, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.