ETV Bharat / bharat

హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్.. ఆదివారమే ప్రమాణస్వీకారం

author img

By

Published : Dec 10, 2022, 6:53 PM IST

Updated : Dec 10, 2022, 7:24 PM IST

హిమాచల్​ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి నేతృత్వం వహించిన సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఎన్నికయ్యారు. సీఎం రేసులో అనేక మంది ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. ఆదివారం సుఖ్విందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Sukhvinder Singh Sukhu
హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి నేతృత్వం వహించిన సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా పనిచేసిన ముకేశ్‌ అగ్నిహోత్రికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్లు శాసనసభాపక్ష సమావేశం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. ఆదివారం సుఖ్విందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

'కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. మా ప్రభుత్వం మార్పు తీసుకువస్తుంది. హిమాచల్ ప్రజలకు కాంగ్రెస్ పార్చీ ఇచ్చిన హామీలను నేరవేర్చుతాం. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాను. డిప్యూటీ సీఎం ముకేశ్​ అగ్నిహోత్రితో కలిసి టీమ్​గా పనిచేస్తాను. 17 ఏళ్ల వయసులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను'

--సుఖ్విందర్​ సింగ్ సుఖు, హిమాచల్ ప్రదేశ్ సీఎం

ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తూ.. శనివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం సుఖ్విందర్‌ను సీఎంగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గతంలో హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన సుఖ్విందర్‌.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా సుఖ్విందర్‌కు గుర్తింపు ఉంది.

అయితే సీఎం రేసులో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌.. అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి తనకు పెద్దగా మద్దతు లేకపోవడంతోనే ఆమె వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రతిభా సింగ్‌ సీఎం రేసు నుంచి వైదొలగడం వల్ల సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సీఎం పదవి లభించింది. కొత్తగా ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేల్లో ఆయనకు 25 మంది మద్దతిచ్చినట్లు తెలుస్తోంది.
హిమాచల్​ ప్రదేశ్​లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ 40 స్థానాలను గెలుపొంది భాజపా నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్.

Last Updated : Dec 10, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.