ETV Bharat / bharat

'భాజపాతో పొత్తా..? సమస్యే లేదు'

author img

By

Published : Jun 5, 2021, 8:54 PM IST

Sukhbir says no alliance with BJP for Punjab assembly polls, slams Congress, AAP
సుఖ్​బిర్ సింగ్ బాదల్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీలతో పొత్తులు పెట్టుకునేది లేదని శిరోమణి అకాలీదళ్ స్పష్టం చేసింది. వీరు కాకుండా ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​పై విమర్శలు గుప్పించింది.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పంజాబ్​కు చెందిన శిరోమణి అకాలీదళ్ కూటములపై కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్, భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ పార్టీలు కాకుండా వేరే వారితో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు శిరోమణి అధ్యక్షుడు సుఖ్​బిర్ సింగ్ బాదల్ తెలిపారు.

ఇదివరకు భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏలో భాగస్వామిగా ఉంది శిరోమణి అకాలీదళ్. నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆ కూటమి నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో భాజపాతో మళ్లీ పొత్తు ఉండబోదని బాదల్ తేల్చి చెప్పారు. "మేం కూటముల కోసం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్, భాజపా, ఆప్​లతో మేం పొత్తు కుదుర్చుకోలేం. ముఖ్యంగా భాజపాతో అసలే కుదరదు" అని వ్యాఖ్యానించారు.

కుర్చీ కోసం అమరిందర్

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు బాదల్. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్.. వ్యాక్సినేషన్​ను సొంత లాభాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిపై దృష్టిపెట్టకుండా తన కుర్చీ కాపాడుకునేందుకు దిల్లీ వెళ్తున్నారని అన్నారు.

ప్రచారం కోసం కేజ్రీ

మరోవైపు, దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్​ పబ్లిసిటీ కోసమే పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఒక్క స్కూల్​ను పునర్నిర్మించి.. విద్యా వ్యవస్థనే బాగు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన మోసాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. దిల్లీలో కరోనా విజృంభణ అధికమై, పరిస్థితులు చేయిదాటి పోయిన సమయంలో కోర్టు ముందు లొంగిపోయారని అన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేని ఆ వ్యక్తి సీఎం పదవిలో ఉండేందుకు అనర్హులని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి- ప్రియుడి బర్త్​ డే పార్టీకి వెళ్లిన బాలికపై గ్యాంగ్​ రేప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.