ETV Bharat / bharat

కరోనా కట్టడికి ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

author img

By

Published : Apr 15, 2021, 7:55 PM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలను కఠినతరం చేశాయి. దిల్లీలో వారాంతపు లాక్‌డౌన్‌ ప్రకటించగా.. రాజస్థాన్‌ సర్కార్‌ రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్రమంతా విధించింది. కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో యూపీ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా గొలుసును తెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.

covid surge, restrictions in states
కఠిన ఆంక్షలు, కరోనా కట్టడిలో రాష్ట్రాలు

కరోనా కట్టడి కోసం దిల్లీ సర్కార్‌ వారాంతపు లాక్‌డౌన్ ప్రకటించింది. రోజువారీ కేసుల్లో ముంబయిని అధిగమించిన దిల్లీ దేశంలో అత్యంత కరోనా ప్రభావిత నగరంగా నిలిచింది. ఈ నేపథ్యంలో వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో 17 వేలకుపైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

శుక్రవారం రాత్రి 10గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది. మాల్స్, ఆడిటోరియంలు, వ్యాయామశాలలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, అత్యవసర సేవలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాస్‌లు జారీచేయనున్నారు. ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి కూడా పాస్‌లు ఇవ్వనున్నారు. రెస్టారెంట్లను పార్శిల్ సేవలకే పరిమితం చేశారు. సినిమా థియేటర్లు 30శాతం సామర్థ్యంతో నడపాలని దిల్లీ సర్కార్‌ నిర్దేశించింది.

రాజస్థాన్​లోనూ...

రాజస్థాన్ సర్కార్ కూడా ఆంక్షలను కఠినతరం చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది. పది పట్టణాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించినా ఫలితం కనిపించకపోవటంతో రాష్ట్రమంతా రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేయాలని రాజస్థాన్‌ సర్కార్‌ నిర్ణయించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించింది. ప్రైవేటు ఫంక్షన్లు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేశారు. అంత్యక్రియలకు 20మందిని మాత్రమే అనుమతిస్తారు.

సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించిన రాజస్థాన్‌ సర్కార్‌.. సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్‌లు, అమ్యూజ్ మెంట్ పార్కులు, జిమ్‌లు, ఈతకొలనులు మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లు, క్లబ్‌లకు 50శాతం పరిమితి విధించారు. వంద మందికిపైగా సిబ్బంది ఉండే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50శాతం పరిమితి విధించారు. మిగితా వారు ఇంటి నుంచే పని చేయాలన్నారు. బస్సులనూ 50శాతం సీటింగ్ సామర్ధ్యంతో తిప్పాలని రాజస్థాన్‌ సర్కార్‌ ఆదేశించింది.

కఠిన నిబంధనల దిశగా యూపీ..

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా నిబంధనలు కఠినతరం చేసింది. యాక్టివ్ కేసులు 2వేల కంటే ఎక్కువగా ఉన్న 10జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని యోగి సర్కార్‌ ప్రకటించింది. మే 15వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఇదీ చదవండి:మర్కజ్​లో నమాజుకు 50మందికి మాత్రమే అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.