ETV Bharat / bharat

'ఒమిక్రాన్'పై ముందస్తు జాగ్రత్తలు- రాష్ట్రాలు సన్నద్ధం

author img

By

Published : Nov 27, 2021, 9:34 PM IST

omicron measures in states
ఒమిక్రాన్​పై రాష్ట్రాలు ముందస్తు చర్యలు

కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​(Omicron variant) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి(Covid new variant india), మరో వేవ్​కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఒమిక్రాన్​ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ (omicron variant)​ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వేరియంట్​కు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్​లో ఈ వేరియంట్(India omicron covid)​ విస్తరించి.. 'థర్డ్ వేవ్'​కు దారి తీయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రయాణ ఆంక్షల సడలింపుపై పునఃపరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై మరింత పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఇదే తరుణంలో పలు రాష్ట్రాలు వైరస్​ కట్టడి కోసం ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి.

ఏయే రాష్ట్రాల్లో ఎలా..?

  • విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు(Maharashtra new covid guidelines today) జారీ చేసింది.
  • దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి(Mumbai omicron) వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలని... ముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ స్పష్టం చేశారు. వారి నుంచి రక్తనమూనాలు తీసుకుని.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్​లకు పంపిస్తామని తెలిపారు.
  • విదేశీ ప్రయాణికుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం(Gujarat on omicron) కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఐరోపా, బ్రిటన్​, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ నుంచి గుజరాత్​లోకి వచ్చేవారు పూర్తి స్థాయి కరోనా టీకా తీసుకోనట్లైతే.. విమానాశ్రయాల్లో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి టీకా తీసుకున్నవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, ఎలాంటి లక్షణాలు లేకపోతేనే.. రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది.
  • బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సీనియర్ అధికారులను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. అంతకుముందు.. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.
  • విదేశాల్లో కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తి దృష్ట్యా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచామని చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ టీకా తీసుకోవాలని ఆమె కోరారు.
  • కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా.. తమ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్య శాఖ​ మంత్రి విశ్వాస్​ సారంగ్​ తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్​​ వేగవంతంగా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు తమ రాష్ట్రంలో బయటపడలేదని పేర్కొన్నారు.
  • కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం చూపిస్తేనే తమ రాష్ట్రంలోకి అనుమితిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 16 రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు.. మరోసారి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్​లో పని చేసే వారంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో శనివారం ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.