ETV Bharat / bharat

శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి

author img

By

Published : Mar 28, 2023, 6:53 AM IST

Sri Rama Navami
Sri Rama Navami

Sri Rama Navami Festival In Bhadrachalam: శ్రీరాముడి కల్యాణ మహోత్సావనికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం కొత్తకళ సంతరించుకుంది. ఎటుచూసినా స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో కల్యాణ వైభవం కనిపిస్తోంది. రాములోరి కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు.. తరలిరానున్న అశేష భక్తజనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి

Sri Rama Navami Festival In Bhadrachalam: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో ఈనెల 30న జరిగే శ్రీరామనవమికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాములోరి కల్యాణ కార్యక్రమాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆలయ మాఢ వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం ఈసారి రూ.2 కోట్ల నిధులతో సకల ఏర్పాట్లు చేస్తోంది. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కల్యాణం జరిగే మిథిలా మైదానంతోపాటు.. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు సిద్ధం చేశారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా సెక్టార్ల వారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి అందమైన రంగులద్దారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు అందించేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. ఎక్కువ కౌంటర్ల ద్వారా తలంబ్రాలు, లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈనెల 31న జరిగే 'పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం' కోసం రెండు యాగశాలలు నిర్మించారు. ప్రతిరోజు రామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం దేశంలోని వివిధ నదుల నుంచి పుణ్య జలాలను భద్రాద్రికి తీసుకోవచ్చారు. పట్టాభిషేకం వేడుక కోసం ద్వాదశ సువర్ణ వాహనాలను సిద్ధం చేశారు.

శ్రీరామనవమికి భద్రాచలం తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక యాప్‌ను కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ జీ.వినిత్ విడుదల చేశారు. ఈ యాప్‌లో ఆలయానికి సంబంధించిన సమస్త సమాచారం సహా భద్రాద్రికి చేరుకునే మార్గం సహా ఇతర సమాచారం లభిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడాదివాసం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. జీయర్ మఠంలో త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో.. గరుడ పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాములకు సువర్ణ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు.

"కొవిడ్​ తర్వాత ఇప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉండడంతో ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తం వ్యయం చేశాము. మిథుల స్టేడియంలో కల్యాణానికి ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయి. ఆన్​లైన్​ సేవల ద్వారా కూడా టిక్కెట్లు సేల్​ చేస్తున్నాము." - రమాదేవి, ఆలయ ఈవో, భద్రాచలం

"భద్రాచలాన్ని 26 సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లను చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశాము. ఆన్​లైన్​లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక యాప్​ను రూపొందించాము." - అనుదీప్, కలెక్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.