ETV Bharat / bharat

ఈ జాతీయ జెండాలు పర్యావరణహితం!

author img

By

Published : Jan 26, 2021, 12:57 PM IST

ఏ జాతీయ పండుగ వచ్చినా ప్లాస్టిక్​ జెండాల మధ్యే జరుపుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్​ను నియంత్రించేందుకు మంగళూరుకు చెందిన పేపర్ సీడ్స్ ఆర్గనైజేషన్ కృషి చేస్తోంది. సంస్థకు చెందిన నితిన్​ వాస్​ పర్యావరణహిత జెండాలు, బ్యాడ్జిలను రూపొందిస్తున్నాడు.

eco friendly flags, flag, mangalore
ఈ జెండాలు పర్యావరణహితం!

ఈ జెండాలు పర్యావరణహితం!

ప్రస్తుత ఆధునిక కాలంలో యావత్ ప్రపంచాన్ని ప్లాస్టిక్ ఆక్రమించేసింది. ప్రజలంతా ఎక్కువ శాతం ప్లాస్టిక్ వస్తువులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పర్యావరణహిత ప్రత్యామ్నాయాలు లేక అవే ప్లాస్టిక్ వస్తువులను వాడక తప్పని స్థితి. అప్పట్లో జాతీయ జెండాలను వస్త్రంతో తయారు చేసేవారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించింది. ప్లాస్టిక్‌తో తయారైన త్రివర్ణ పతాకాలే ఎక్కువగా కనిపిస్తాయి. మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పర్యావరణహిత జెండాలు, బ్యాడ్జిలు రూపొందిస్తున్నాడు.

స్వాతంత్ర్య దినోత్సవమైనా, గణతంత్ర వేడుకలైనా, ఇతర జాతీయ పండుగలైనా ప్రజలంతా ప్లాస్టిక్‌తో తయారైన జెండాలనే వినియోగిస్తారు. ఇవి నీటిలో కరగవు, మట్టిలోనూ కలిసిపోవు. ప్లాస్టిక్ నియంత్రణకు కృషిచేస్తున్న మంగళూరుకు చెందిన పేపర్ సీడ్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ హిత జెండాలు, బ్యాడ్జ్‌లు రూపొందించింది. ఈ సంస్థకు చెందిన నితిన్ వాస్ వీటి రూపకర్త. కాగితపు గుజ్జును వాడి, పూర్తిగా ప్లాస్టిక్‌ రహితంగా తయారుచేయడం వల్ల భూమికి గానీ, పర్యావరణానికి గానీ ఎలాంటి హానీ కలగదని చెప్తున్నాడు నితిన్.

దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఆశయంతో కాగితపు గుజ్జుతో జెండా, బ్యాడ్జీ తయారు చేశాం. వాటిని మట్టి లేదా నీటిలో కలిపితే కరిగిపోతాయి.

-నితిన్ వాస్, కళాకారుడు

పర్యావరణ ప్రేమికుడు నితిన్ వాస్... కాగితపు గుజ్జుతో జాతీయ జెండాలు, బ్యాడ్జిలు తయారుచేశాడు. వాటిలోపల పళ్లు, కూరగాయల గింజలను పెట్టాడు. వాటిని మట్టిలోకి విసిరేసినా ఆ విత్తనాలు మొలకెత్తుతాయని చెప్తున్నాడు.

ఈ ప్రత్యేక జెండాలు, బ్యాడ్జ్‌లలో పండ్లు, కూరగాయల గింజలుంటాయి. ఈ బ్యాడ్జిలను వినియోగించిన తర్వాత మొక్కలు పెంచే కుండీల్లో నాటవచ్చు. కాగితపు గుజ్జుతో తయారుచేసిన బ్యాడ్జ్ మట్టిలో కరిగిపోయి, విత్తనం మొలకెత్తుతుంది.

-నితిన్ వాస్, కళాకారుడు

పర్యావరణ ప్రేమికులే కాదు.. సామాన్యుల నుంచీ పర్యావరణహిత జెండాలకు విశేష స్పందన లభిస్తోంది. జాతీయ పండుగలకు ప్లాస్టిక్ జెండాలు, బ్యాడ్జ్‌ల వాడకానికి స్వస్తి చెప్పి, వీటిని వాడాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : కళ్లు చెదిరేలా బైక్​పై రైతు విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.