ETV Bharat / bharat

ఈ సరస్సులో మునిగారో.. తేలేది శవంగానే!

author img

By

Published : Mar 30, 2021, 7:02 AM IST

special story on death valley in haryana
ఈ సరస్సులో మునిగారో.. తేలేది శవంగానే!

అందమైన ఆరావళీ పర్వతాల మధ్యలో ఉందో సరస్సు. మనస్సుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ సరస్సులో కాలుపెట్టారో కాలనాగు కాటువేస్తుంది. అదే హరియాణాలోని డెత్ వ్యాలీ. పేరులోనే మృత్యువు దాగి ఉన్న ఈ సరస్సులో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఎందుకిలా జరుగుతుందంటే..

ఆరావళీ పర్వతాలు దాదాపు 692 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల్లో ఎన్నో రహస్య ప్రాంతాలున్నట్లు చెప్తారు. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న ఓ సరస్సు అలాంటిదే. దాని పేరు డెత్ లేక్. చూసేందుకు మిగతా అన్ని సరస్సుల్లా సాధారణంగానే కనిపించినా..దీని చరిత్ర మాత్రం భయానకమైనదే. తెలిసో, తెలియకో ఈ నీటిలోకి దిగిన వారెవ్వరూ తిరిగి బయటికి రాలేదని చెప్తారు స్థానికులు.

ప్రాణాలు తోడేస్తున్న డెత్​ వ్యాలీ

ఇక్కడికి ఎప్పుడొచ్చి చూసినా, ఈ సరస్సు ఎంత బాగా అనిపిస్తుందో! ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నాలుగు వైపులా అందమైన కొండలుంటాయి. చూసేందుకు చాలా బాగుంటుంది.

-అనిల్, స్థానికుడు

సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఈ సరస్సు గురించి తెలుసుకుంటారు. దిల్లీ సహా.. పరిసర ప్రాంతాలకు చెందిన కళాశాలల నుంచి యువతీయువకులు ఇక్కడికి వస్తుంటారు. ఇంటర్నెట్‌లోనూ ఈ సరస్సు డెత్ వ్యాలీ పేరుతోనే కనిపిస్తుంది.

అందరూ ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు. పైగా ఏది ట్రెండింగ్‌లో ఉంటే అది చేస్తారు. ఈ డెత్ వ్యాలీ కూడా అలా ట్రెండింగ్‌లో ఉన్నదే. అందుకే ఇక్కడ తిరిగేందుకు పెద్దఎత్తున వస్తారు.

-యశ్, విద్యార్థి

ఈ సరస్సులో దిగి, గల్లంతైన వారి సంఖ్య ఏటికేడూ పెరుగుతూ వస్తోంది. సరస్సు ఎంత లోతు ఉంటుందో అంచనా వేయలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు అధికారులు. నీటిలోకి దిగిన తర్వాత లోతెంత ఉందో తెలుసుకోలేక, ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది.

ఇప్పటివరకూ ఈ సరస్సు లోతెంతో కూడా ఎవ్వరికీ తెలియదు.

-అనిల్, స్థానికుడు

ఈ సరస్సు అడుగున చాలా రాళ్లుంటాయి. ఆ రాళ్లపై కాలు పెడితే జారుతుంది. ఇది తక్కువ లోతే ఉందని ప్రజలు భ్రమపడుతుంటారు. కానీ అసలైన లోతెంతో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు.

-ఓంప్రకాశ్, స్థానికుడు

డెత్ వ్యాలీగా పేరొందిన ఈ సరస్సులో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో..వీటిని ఎలా ఆపాలన్నది అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇక్కడికి వచ్చేవాళ్లందరినీ.. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పోలీసుల తరఫున మేం ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూనే ఉంటాం. సరస్సు బాగా లోతు ఉన్నందున వీలైనంత మేరకు లోపలికి దిగకుండా ఉండమని హెచ్చరిస్తాం.

-అర్పిత్ జైన్, పోలీసు అధికారి

ఫరీదాబాద్‌లోని ఆరావళీ పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ సరస్సులో మునిగి వందలాది మంది గల్లంతయ్యారు. సామాజిక మాధ్యమాల్లో చూసి, థ్రిల్ కోసం ఇక్కడికి వచ్చేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆ శరణార్థులకు కూడు-గూడు ఇవ్వొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.