ETV Bharat / bharat

'సోలీ సొరాబ్జీ సేవలు మకుటాయమానం'

author img

By

Published : May 31, 2021, 7:54 AM IST

CJI Ramana, nv ramana
Soli Sorabjee, cji ramana

ప్రముఖ న్యాయకోవిదుడు సోలీ సొరాబ్జీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ ఘనంగా నివాళులర్పించారు. న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల్లాంటి రాజ్యాంగ సూత్రాలపై అకుంఠిత విశ్వాసం ఉన్న వ్యక్తి సొరాబ్జీ అని కొనియాడారు.

నాగరిక సమాజంలో మానవ మనుగడకు అత్యవసరమైన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు రాజ్యాంగ విలువలను కాపాడటమే న్యాయ కోవిదుడు సోలీ సొరాబ్జీకి నివాళి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ పేర్కొన్నారు. ఆయన లాంటి వారు నిరంతరం మన జ్ఞాపకాల్లో జీవించే ఉంటారని చెప్పారు. సొరాబ్జీ కుటుంబసభ్యులు, ఆయన వద్ద పని చేసిన న్యాయవాదులు కలిసి ఏర్పాటు చేసిన సంతాప సభలో జస్టిస్‌ రమణ పాల్గొని స్మారకోపన్యాసం చేశారు.

రాజ్యాంగ హక్కుల పోరాట యోధుడిని కోల్పోయి అప్పుడే నెల రోజులైందంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల్లాంటి రాజ్యాంగ సూత్రాలపై అకుంఠిత విశ్వాసం ఉన్న వ్యక్తి సొరాబ్జీ అన్న జస్టిస్‌ రమణ.. ఎమర్జెన్సీ రోజుల్లో పౌర స్వేచ్ఛను బలంగా సమర్థించారని గుర్తు చేశారు. ఎన్నో గొప్ప కేసుల్లో న్యాయవాదిగా, అటార్ని జనరల్‌గా ఆయన ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు.

నవీన న్యాయ శాస్త్ర రూపకల్పనలో సొరాబ్జీది కీలకపాత్ర అన్న జస్టిస్‌ రమణ.. తనకే కాకుండా న్యాయవ్యవస్థ మొత్తానికి ఆయన కీర్తి ప్రతిష్ఠలు సముపార్జించారని తెలిపారు. సొరాబ్జీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు. లలిత్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌ సహా పలువురు న్యాయవాదులు నివాళులర్పించారు.

ఇదీ చూడండి: మోదీ X దీదీ: తారస్థాయికి సీఎస్​ వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.