'జాతీయ జంతువుగా ఆవు' పిటిషన్​ తిరస్కరణ.. కొలీజియం నియామకాలకు బ్రేక్

author img

By

Published : Oct 10, 2022, 4:17 PM IST

declared cow as national animal

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు, దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్​ అభయ్​ ఎస్​ ఒక నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్​ను తిరస్కరించింది. ఆవుల పరిరక్షణ చాలా ముఖ్యమని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదించగా.. 'ఇదేనా కోర్టు పని?.. ఇలాంటి పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తారు?' అంటూ ప్రశ్నించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ గోవాన్ష్​ సేవా సదన్​ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పిటిషన్​ను దాఖలు చేసింది.

మరోవైపు, క్రిమినల్​ నేరప్రవృత్తి కలిగిన అభ్యర్థుల వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్​సైట్​లో పొందుపరచాలంటూ దాఖలైన పిటిషిన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలంటూ అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్​ అభయ్​ ఎస్​ ఒక నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్​ను తిరస్కరించింది. ఈ విషయంపై భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలంటూ పిటిషనర్​కు సూచించింది. ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ గ్యాంగ్​స్టర్​ నహీద్​ హసన్​కు అసెంబ్లీ టికెట్​ ఇచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్​ దాఖలైంది.

కొలీజియం నియామకాలకు బ్రేక్​:
దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొలీజియంలో ఉన్న ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు... హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొలీజియం తరపున విడుదల చేసిన ప్రకటనలో సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నేతృత్వంలో కొలీజియం సమావేశాలు జరగవని ఆ ప్రకటనలో కోర్టు తెలిపింది. మళ్లీ జస్టిస్ డీవై చంద్రచూడ్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే కొలీజియం సమావేశమవుతుందని.. అప్పుడే న్యాయమూర్తుల నియమకాలు ఉంటాయని ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న నలుగురు జడ్జిల నియామకం కోసం కొలీజియం సభ్యులకు సీజేఐ జస్టిస్ లలిత్ లేఖ రాశారు. ఈ ప్రక్రియపై ఇద్దరు న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది.

ఇవీ చదవండి: 'ధరణి పుత్రుడు' ములాయం మృతి పట్ల ప్రముఖుల సంతాపం- మోదీ భావోద్వేగం!

యూపీపై వరుణుడి పంజా.. 25 మంది బలి.. 12 జిల్లాల్లో స్కూల్స్​ బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.