ETV Bharat / bharat

కక్షిదారుల నిధి సొమ్మూ ఆ బాధితురాలికే: సుప్రీంకోర్టు

author img

By

Published : Mar 21, 2021, 5:31 AM IST

2012లో కోల్​కతా విమానాశ్రయంలో మరణించిన ప్రయాణికుడి భార్యకు మరో రూ. 50 వేలు చెల్లించాలని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ)ను ఆదేశించింది సుప్రీంకోర్టు. కక్షిదారుల నిధి కింద జమ చేసిన ఆ మొత్తాన్ని బాధిత మహిళకే ఇవ్వాలని స్పష్టం చేసింది.

విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ) నిర్లక్ష్యం కారణంగా మరణించిన వ్యక్తి భార్యకు మరో రూ. 50 వేలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2012లో కోల్​కతా విమానాశ్రయంలో ఓ ప్రయాణికునికి గుండెపోటు రాగా అక్కడి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆయన భార్య జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆమెకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని 2015లో ఫోరం ఆదేశించింది.

దీన్ని సవాల్​ చేస్త ఏఏఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసే ముందు పరిహారంలో సగం మొత్తాన్నిగానీ, రూ. 50 వేలనుగానీ, ఏది తక్కువయితే అది.. కక్షిదారుల నిధి కింద జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏఏఐ రూ. 50 వేలను జమ చేసింది. అపీలును కొట్టివేస్తే ఈ మొత్తాన్ని బాధితులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఏఏఐ చేసిన అపీలును 2019లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. రూ. 10 లక్షల పరిహారంతో పాటు, దానిపై 9 శాతం వడ్డీ, కోర్టు ఖర్చుల కింద రూ. 20 వేలు ఇవ్వాలని ఏఏఐని ఆదేశించింది. ప్రస్తుతం కక్షిదారుల నిధి కింద జమచేసిన రూ. 50 వేలను కూడా ఆ మహిళకే ఇవ్వాలని శుక్రవారం తీర్పు చెప్పింది.

ఇదీ చూడండి: 'ఆ తీర్పు చదువుతుంటే తలనొప్పి వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.