ETV Bharat / bharat

ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి సుప్రీం డెడ్​లైన్​

author img

By

Published : Sep 15, 2021, 1:34 PM IST

దేశంలోని వివిధ ట్రైబ్యునళ్లలోని ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Tribunals Supreme Court) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సమయంలో ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

supreme court
సుప్రీంకోర్టు

ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Tribunals Supreme Court) మరోసారి అసంతృప్తి వెళ్లగక్కింది. సుప్రీం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించినా.. సర్కారు తీరులో ఏ మాత్రం మార్పు లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ, జస్టిస్ డీవై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని, ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని గుర్తు చేశారు.

విచారణ సందర్భంగా జస్టిస్‌ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయపాలన.. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలని, ఒక ఏడాది పని చేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వస్తారా అని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య పెరుగుతుందని గుర్తు చేశారు. ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ సమయంలో కేంద్రానికి ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమస్యలు అందరికీ తెలుసు అని, కావలసింది పరిష్కారమే అని జస్టిస్ రమణ అన్నారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అని స్పష్టం చేశారు.

కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కేకే. వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఖాళీల భర్తీకి రెండు వారాలు సమయం ఇవ్వాలని, అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనికి సుప్రీం ధర్మాసనం సమ్మతించింది. ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నామని, మరికొంత సమయం కూడా ఎదురు చూడగలమని జస్టిస్‌ ఎన్​వీ రమణ అన్నారు. ఏజీ కోరినట్లుగా విచారణను 2 వారాలు వాయిదా వేస్తామని, ఆ లోపు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదని అన్నారు.

నియామకాలు, ఖాళీలపై స్పష్టమైన విధానంతో రావాలని అటార్నీ జనరల్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2 వారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాల జారీకి సిద్ధమని తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి: Tribunals Supreme Court: నియామకాలు చేపడతారా? చర్యలు తీసుకోమంటారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.