ETV Bharat / bharat

30కి.మీ నడిచి.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడిపి.. తెలుగు విద్యార్థి ఆవేదన

author img

By

Published : Feb 27, 2022, 8:44 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా ఇక్కడకు తరలించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను లీవూలో ఉంటోన్న తెలుగు విద్యార్థి 'ఈనాడు.నెట్‌'తో పంచుకున్నారు.

Russia Ukraine War
ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం

Russia Ukraine War: రష్యా ముప్పేటదాడితో ఉక్రెయిన్‌ చిగురుటాకులా వణికిపోతోంది. ఉక్రెయిన్‌ వాసులతో పాటు, భారతీయులు సైతం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో భారతీయులను సురక్షితంగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

అయితే, విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను లీవూలో ఉంటూ వైద్య విద్య(ఫస్ట్‌ ఇయర్‌)ను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థి వంకాయల విష్ణు వర్థన్‌ స్వయంగా 'ఈనాడు.నెట్‌'తో పంచుకున్నారు.

"ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందని వార్తలు వస్తున్నప్పటి నుంచి మా కళాశాల నుంచి వెళ్లిపోతామని కోరాం. అందుకు యాజమాన్యం మొదట అంగీకరించలేదు. అయితే, యుద్ధం మొదలైన తర్వాత సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రష్యా సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచే మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. దాదాపు దుకాణాలన్నింటినీ మూసివేశారు. ఆహార పదార్థాలు సమకూర్చుకోవటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నాతో పాటు ఎక్కువమంది మలయాళీలు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. లీవూ నుంచి పోలాండ్‌ సరిహద్దుల వరకూ రావాల్సిందిగా ఇండియన్‌ ఎంబసీ నుంచి మాకు సమాచారం అందించింది. తోటి భారతీయ విద్యార్థులతో కలిసి అందరం పోలాండ్‌ సరిహద్దులకు బయలుదేరాం"

"ఈ క్రమంలో రవాణా సదుపాయం కూడా మాకు సరిగా అందలేదు. మైనస్‌ డిగ్రీ ఉష్ణోగ్రతలోనే సుమారు 30 కి.మీ. నడిచిన తర్వాత బస్సు సదుపాయం లభించింది. అక్కడి నుంచి పోలాండ్‌ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మరో సరిహద్దు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించమని సూచించారు. నడవలేని పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయిస్తే అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాళ్లు చెప్పే మొత్తం చెల్లించలేక మళ్లీ కొన్ని కి.మీ. నడుచుకుంటూ పోలాండ్‌కు 10కి.మీ. దూరంలో ఆగాం. మాతో పాటు మహిళలూ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఇక్కడ అందుబాటులో ఉన్న భవనం లోపల ఉంచి మేమంతా బయట ఉంటున్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. తినడానికి సరైన ఆహారం, నీరు కూడా లేదు. అయితే, ఇండియన్‌ ఎంబసీ వాళ్లు వీలైనంత త్వరగా పోలాండ్‌కు తీసుకెళ్తామని చెప్పారు.

అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా మాకు సాయం చేసి, భారత్‌కు తీసుకెళ్లే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని విష్ణు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానంటూ మహిళకు టోకరా
250 మందితో దిల్లీ చేరిన రెండో విమానం.. విద్యార్థుల హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.