ETV Bharat / bharat

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​.. బరిలో చిదంబరం, సూర్జేవాలా

author img

By

Published : May 30, 2022, 3:52 AM IST

Congress RajyaSabha: కాంగ్రెస్‌ పార్టీ తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఏడు రాష్ట్రాల నుంచి 10 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్‌ నుంచి రణ్‌దీప్‌ సింగ్ సూర్జేవాలాలకు అవకాశం కల్పించింది.

-polls-chidambaram
-polls-chidambaram

Congress RajyaSabha: వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్​ వాస్నిక్, ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారీలను రాజస్థాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేశ్​కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకాలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు రాజీవ్ శుక్లా (చత్తీస్​గఢ్​), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ (బిహార్), అజయ్ మకెన్ (హరియాణా), ఇమ్రాన్ ప్రతాప్​ గర్హి (మహారాష్ట్ర)లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేశ్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. మరో సీనియర్​ నేత గులాంనబీ ఆజాద్​కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చాలేదు. పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలంటూ 2020లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో ముకుల్ వాస్నిక్​, వివేక్ టంకాలకు రాజ్యసభ అవకాశం లభించడం గమనార్హం.

అంతకుముందు భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాల నుంచి 16 మందికి రాజ్యసభ సీట్లు ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూ‌ష్​ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలోనే వీరు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్​ 10న జరగనున్నాయి.

అయితే రాజ్యసభలో కాంగ్రెస్‌ బలం కాస్త పెరగనుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆ పార్టీకి చెందిన 10 మంది నేతలు సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఆయా స్థానాలకు పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. పెద్దల సభలో కాంగ్రెస్‌ ప్రస్తుత బలం 29. రాబోయే రెండు నెలల్లో సభలో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో భాగంగా హస్తం పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు- పి.చిదంబరం (మహారాష్ట్ర), జైరాం రమేశ్‌ (కర్ణాటక), అంబికా సోని (పంజాబ్‌), వివేక్‌ టంకా (మధ్యప్రదేశ్‌), ప్రదీప్‌ టంటా (ఉత్తరాఖండ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఛాయా వర్మ (ఛత్తీస్‌గఢ్‌) తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. కొత్తగా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాజస్థాన్‌లో 3; ఛత్తీస్‌గఢ్‌లో 2; తమిళనాడు, ఝార్ఖండ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడం దాదాపు ఖాయం. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే హరియాణా, మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ ఒక్కో స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. దీంతో పెద్దల సభలో కాంగ్రెస్‌ బలం 33కు పెరిగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. నిర్మల, పీయూష్​కు ఛాన్స్​

మహిళలను రాత్రుళ్లు పనిచేయమని ఒత్తిడి చేస్తున్నారా?.. ఇక కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.