71వేల మందికి మోదీ 'జాబ్ లెటర్స్'​.. 16 కోట్ల ఉద్యోగాల సంగతేంటన్న కాంగ్రెస్

author img

By

Published : Jan 20, 2023, 12:47 PM IST

Updated : Jan 20, 2023, 2:44 PM IST

pm narendra modi distributed 71k appointment letters

'రోజ్​గార్ మేళా'లో భాగంగా 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధాని మోదీ అందజేశారు. ఇదే తమ గుర్తింపు అని అన్నారు. దీనిపై కాంగ్రెస్​ పార్టీ ఘాటుగా స్పందించింది. ఏడాదికి రెండు కోట్లు చొప్పును 8 ఏళ్లలో ఇవ్వాల్సిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడో యువతకు చెప్పాలని డిమాండ్​ చేసింది. ఇంకా ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షల ఖాళీలున్నాయని.. వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువని ఎద్దేవా చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్​గార్​ మేళాలో భాగంగా 71,426 మందికి నియామక పత్రాలు అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్​ ద్వారా వారికి నియామక పత్రాలు అందజేశారు. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్​మెంట్​ లెటర్లను అందించారు. రోజ్​గార్​ మేళాలు తమ ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయన్నారు. తాము సంకల్పించిన వాటిని పూర్తిచేస్తామని ఇది రుజువు చేస్తుందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియలో చాలా మార్పులు చేసి క్రమబద్ధీకరించామని.. ఇది పారదర్శకతను పెంచుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నియామక పత్రాలు అందుకున్న యువతను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజలకు సేవ చేసేందుకు సంకల్పించాలని కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి మోదీ చెప్పారు. ఈ సందర్భంగా వారికి ఓ మంత్రాన్ని ఉపదేశించారు. "వ్యాపారంలో ఎల్లప్పుడూ వినియోగదారుడే కరెక్ట్. అలాగే పరిపాలనా వ్యవస్థలో పౌరుడే ఎప్పుడూ రైట్​. అందుకే ప్రభుత్వ రంగంలో ఉపాధిని ప్రభుత్వ సేవ అంటారు.. ఉద్యోగం అనరు. ఇప్పుడు నియామక పత్రాలు అందుకున్న వారి కుటుంబాల్లోంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం చేయలేదు" అని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో భారీగా పెట్టుబడులు పెట్టిన కారణంగానే ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు మోదీ. అభివృద్ధి వేగంగా జరిగితే స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.

pm narendra modi distributed 71k appointment letters
వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా యువతతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రధాని మోదీ నిబద్ధతకు రోజ్​గార్​ మేళాలు నిదర్శనమని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంతకముందు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ అభివృద్ధిలో యువత పాలుపంచుకునేలా, సాధికారత సాధించేలా ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రోజ్​గార్​ మేళాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని.. జూనియర్ ఇంజినీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ డాక్ సేవక్, ఆదాయ పన్ను ఇన్‌స్పెక్టర్లు, ఉపాధ్యాయులు, నర్సులు, వైద్యులు, సామాజిక భద్రత అధికారులు వంటి వివిధ ఉద్యోగాల్లో చేరనున్నారు.

'71 వేల ఉద్యోగాలు సరే.. 16 కోట్ల సంగతేంటి?'
ప్రధాని మోదీ 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడంపై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది. 71 వేల ఉగ్యోగాలు సరే.. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మిగతా 30 లక్షల ఉద్యోగాల మాటేమిటని ప్రశ్నల వర్షం కురిపించింది. భాజపా ఇస్తానన్న 16 కోట్ల ఉద్యోగాల్లో ఇవి చాలా తక్కువ అని మండిపడింది. ఏడాదికి 2 కోట్ల ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదని ఎద్దేవా చేసింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్న ఖర్గే విమర్శనాస్త్రాలు సంధించారు.

"నరేంద్ర మోదీజీ.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షల ఖాళీలున్నాయి. మీరు ఇప్పుడు 71 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇవి చాలా తక్కువ. ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. కాబట్టి 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కుడున్నాయనే విషయం యవతకు చెప్పండి" అంటూ హిందీలో ట్వీట్​ చేశారు.

Last Updated :Jan 20, 2023, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.