ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?

author img

By

Published : Mar 13, 2022, 10:34 AM IST

Uttarakhand cm candidate: ఉత్తరాఖండ్​లో భాజపా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వానికి నేతృత్వం వహించేది ఎవరనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పుష్కర్​ సింగ్​ ధామి ఓటమితో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె రీతూ ఖండూరీ పేరు బలంగా వినిపిస్తోంది.

Ritu Khanduri
రీతు ఖండూరీ

Uttarakhand cm candidate: ఉత్తరాఖండ్​లో భాజపా అఖండ విజయం సాధించినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి ఓటమితో నూతన ప్రభుత్వ సారథి ఎవరనే విషయమై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. పుష్కర్​ సింగ్​ ధామికి మళ్లీ ఆ పదవి లభించకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే నియమైతే.. రాష్ట్ర మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీకి ఆ అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. కోట్​ద్వార్​ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె.. ఉత్తరఖాండ్​ తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై చర్చించేందుకు దిల్లీకి రావాలంటూ రీతూకు భాజపా హైకమాండ్​ నుంచి పిలుపు రావటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జులుగా వ్యవహరించిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్​, పీయూష్​ గోయల్​లు దిల్లీ నుంచి రాష్ట్రానికి ఇంకా తిరిగి రాకపోవటమూ.. సీఎం అభ్యర్థిపై చర్చలు కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది.

మరోవైపు.. పుష్కర్​ సింగ్​ ధామి, సుబోధ్​ ఉనియాల్​లను సైతం దిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిళలు గతంలో ఎన్నడూ లేని విధంగా భాజపాకు మద్దతు పలకటమూ.. రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచనకు దారితీసినట్లు తెలుస్తోంది.

తనకు దిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు ఈటీవీ భారత్​తో తెలిపారు రీతూ. అయితే, తన పేరు ముఖ్యమంత్రి రేసులో ఉందని చెప్పలేనన్నారు. కానీ, ఆమె భర్త రాజేశ్​ భూషణ్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నందున సీఎంగా ప్రకటించేందుకు అవకాశం ఉందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భూషణ్​..​ కేంద్ర ప్రభుత్వంలో సీనియర్​ హెల్త్​ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పనితీరును మోదీతో పాటు మొత్తం మంత్రివర్గం ప్రశంసించింది.

తెరపైకి మరో ఆరుగురి పేర్లు..

పుష్కర్‌ ధామికి మళ్లీ ఆ పదవి లభించకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో మరో ఆరుగురు నాయకుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వారిలో చౌబట్టఖాల్‌ ఎమ్మెల్యే సత్పాల్‌ మహరాజ్‌, శ్రీనగర్‌ గఢ్వాల్‌ ఎమ్మెల్యే ధన్‌ సింగ్‌ రావత్‌, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, డీడీహాట్‌ ఎమ్మెల్యే బిషన్‌ సింగ్‌ చుఫాల్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇదే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌, రాజ్యసభ ఎంపీ అనిల్‌ బలుని పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవికి వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎమ్మెల్యేలే తమ ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకుంటారని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అగ్రనేతల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సూచనలు అందలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌ తెలిపారు. ప్రస్తుత సీఎం పుష్కర్‌ ధామి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందున మళ్లీ ఆయనకే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని భాజపాలోని ఓ వర్గం నాయకులు అంటున్నారు.

ఇదీ చూడండి: హోలీ తర్వాతే యోగి ప్రమాణస్వీకారం- గవర్నర్​ను కలిసిన 'మాన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.