'అగ్నిపథ్​ సైనిక నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదు'

author img

By

Published : Jun 22, 2022, 8:42 AM IST

Army recruitment 2022 news

Agnipath army recruitment plan: అగ్నిపథ్​​ పథకం కింద నియమించే సైనిక నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. విద్యార్హతలు, పరీక్ష సిలబస్‌, వైద్యప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. రిక్రూట్‌మెంట్లపై సవివర షెడ్యూల్‌ విడుదల చేశారు.

Agnipath army recruitment plan: అగ్నిపథ్‌ పథకం వల్ల సైనిక దళాల నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని త్రివిధ దళాలు స్పష్టంచేశాయి. విద్యార్హతలు, పరీక్ష సిలబస్‌, వైద్యప్రమాణాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. సైనిక పోరాట సామర్థ్యం, సన్నద్ధతపై ఈ విధానం ప్రభావం చూపదని తెలిపాయి. రక్షణ మంత్రిత్వశాఖలోని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ.. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌.కె.ఝా, లెఫ్టినెంట్‌ జనరల్‌ పొన్నప్ప, వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠిలతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. "త్రివిధ దళాల నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంతకుముందు జరిగిన రీతిలోనే ఇది సాగుతుంది. అత్యుత్తమ నైపుణ్యాలను ఆకర్షించేందుకు అగ్నిపథ్‌ను తెచ్చాం. ఇది సైనిక దళాలకు అదనపు బలమవుతుంది" అని అనిల్‌ పురీ పేర్కొన్నారు. 'అగ్నివీరులు'గా నియమితులయ్యేవారు సాహస పురస్కారాలకూ అర్హులేనని తెలిపారు. అగ్నిపథ్‌ కింద ఆర్మీలో మహిళలకూ అవకాశం కల్పిస్తామని లెఫ్టినెంట్‌ జనరల్‌ పొన్నప్ప పేర్కొన్నారు. వారిని సైనిక పోలీసు విభాగంలో నియమిస్తామన్నారు. సైన్యంలో సంప్రదాయ రెజిమెంటల్‌ విధానం కొనసాగుతుందని తెలిపారు. అగ్నిపథ్‌ కింద త్రివిధ దళాల్లో చేపట్టయే నియామక ప్రక్రియపై సవివర షెడ్యూల్‌ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం..

సైన్యంలో..: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ జులై 1 నుంచి మొదలవుతుంది. నియామక ర్యాలీలు ఆగస్టు రెండో వారం నుంచి ఆరంభమవుతాయి. మొదటి బ్యాచ్‌ అగ్నివీరుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష అక్టోబరు 16, నవంబరు 13 తేదీల్లో జరుగుతుంది. ఎంపికైనవారు డిసెంబరు 22న శిక్షణ కేంద్రాల్లో చేరాలి. వీరు శిక్షణ పూర్తిచేసుకొని, వచ్చే ఏడాది జులై 23న సంబంధిత యూనిట్లలో విధుల్లో చేరతారు. రెండో బ్యాచ్‌కి ఉమ్మడి ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 23న జరుగుతుంది. ఎంపికైనవారు ఫిబ్రవరి 23న సైనిక శిక్షణ కేంద్రంలో చేరాలి. ఆశావహుల సందేహాలను తీర్చడానికి అగ్నివీర్‌ హెల్ప్‌లైన్‌ను సైన్యం ప్రారంభించింది.

వాయుసేనలో..: వైమానిక దళంలో అభ్యర్థుల నమోదు ప్రక్రియ జూన్‌ 24 నుంచి జులై 5 వరకూ జరుగుతుంది. స్టార్‌ పరీక్ష (ఆన్‌లైన్‌) కోసం రిజిస్ట్రేషన్‌ జులై 24 నుంచి 31 వరకూ ఉంటుంది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 10 కల్లా కాల్‌లెటర్లు జారీ అవుతాయి. వారికి ఆగస్టు 29 నుంచి నవంబరు 8 మధ్య వైద్య పరీక్షలు జరుగుతాయి. ప్రాథమికంగా ఎంపికైన వారితో కూడిన జాబితాను డిసెంబరు 1న విడుదల చేస్తారు. ఎంపికైన వారికి డిసెంబరు 11న కాల్‌ లెటర్లు పంపిస్తారు. అదే నెల 30న శిక్షణ ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరంలో రెండు శాతం మంది అగ్నివీరులను నియమిస్తారు. ఐదో సంవత్సరం కల్లా ఈ సంఖ్య 6వేలకు చేరుతుంది.

నౌకాదళంలో..: నౌకాదళంలో చేరాలనుకునేవారికి సంబంధించి నమోదు ప్రక్రియ వివరాలు బుధవారం వెలువడతాయి. నమోదు జులై 1 నుంచి ప్రారంభమవుతుంది. సవివర నోటిఫికేషన్‌ జులైలో ప్రచురితమవుతుంది. అదే నెల 15 నుంచి 30 వరకూ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. రాత, దేహదారుఢ్య పరీక్షలు అక్టోబరు మధ్యలో జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులకు నవంబరు 21 నుంచి శిక్షణ మొదలవుతుంది. నౌకాదళంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులు మర్చంట్‌ నేవీలో చేరవచ్చు.

భద్రత కోణంలోనే..: జాతీయ భద్రత కోణంలోనే ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ జరుపుతున్నామని అనిల్‌ పురీ చెప్పారు. ఈ విధానంలో మాజీ సైనికులను నియమిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. "జనాభాపరంగా భారత్‌కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ 50 శాతం మంది.. 25 ఏళ్ల లోపువారే. దాని నుంచి మేం ప్రయోజనం పొందాలి" అని పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై ఇటీవల వెలువరించిన 'విశ్వసనీయ' సమాచారం.. ఈ పథకంపై సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిందని తెలిపారు. దేశంలో అనేకచోట్ల సైనిక ఉద్యోగ ఆశావహులు తమ కసరత్తులను పునఃప్రారంభించారని, దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని తెలిపాయి. త్రివిధ దళాల్లోను, రక్షణ మంత్రిత్వశాఖలోను సుదీర్ఘ సంప్రదింపుల తర్వాతే 'అగ్నిపథ్‌'ను తెరపైకి తెచ్చామన్నారు. గత కొన్నేళ్లుగా కమాండింగ్‌ అధికారుల సరాసరి వయసు తగ్గుతూ వస్తోందని, ఇప్పుడు సైనికుల విషయంలోనూ ఈ మార్పు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

రిస్కు తీసుకోవడానికి మోదీ సిద్ధం: సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. దీన్ని వెనక్కి తీసుకునే ఆలోచనే లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే సైన్యంలో సంస్కరణలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఎంత మూల్యం చెల్లించుకోవడానికైనా తాను సిద్ధమని ఆయన చెబుతుంటారని తెలిపారు. 2006లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అగ్నిపథ్‌ అమలుకు ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ ముందడుగు పడలేదన్నారు. పదవీ విరమణ పొందిన అగ్నివీరులను కిరాయి సైనికులుగా వాడుకునే ప్రమాదం ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. వారు నిజానికి అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థకు దోహదపడతారని చెప్పారు. సైనిక నియామకాలు పూర్తిగా అగ్నిపథ్‌ పథకం ద్వారానే జరగవని స్పష్టం చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ సైన్యంలో స్థానం దక్కించుకున్నవాళ్లకు కఠోర శిక్షణ ఉంటుందన్నారు. "సైన్యంలో సంస్కరణలు అవసరం. ప్రస్తుతం యుద్ధ విధానమే మారిపోతోంది. కనిపించని శత్రువుతో పోరాడాల్సి వస్తోంది. రేపటికి సిద్ధంగా ఉండాలి అంటే ఈరోజు మనం మారాల్సిందే" అని పేర్కొన్నారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్నవారంతా సైన్యంలో చేరాలనుకునేవారు కాదన్నారు.

ప్రధానితో త్రివిధ దళాల అధిపతుల భేటీ: అగ్నిపథ్‌పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంగళవారం త్రివిధ దళాల అధిపతులు జనరల్‌ మనోజ్‌ పాండే, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి, అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌లు ప్రధాని నరేంద్ర మోదీతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త పథకం అమలుపై తమ ప్రణాళికలను వారు వివరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'భారతీయ న్యాయ వ్యవస్థలో చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.