ETV Bharat / bharat

హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా రాహుల్!

author img

By

Published : Aug 4, 2021, 12:08 PM IST

Updated : Aug 4, 2021, 1:34 PM IST

దిల్లీలో హత్యాచారానికి గురైన దళిత చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించారు.

RAHUL GANDHI RAPE VICTIM
రాహుల్ గాంధీ

దేశ రాజధానిలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల దళిత చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఈ ఘటనలో న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

దిల్లీలోని పాత నంగల్‌ గ్రామంలోని ఓ శ్మశానంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ బాలికను తల్లిదండ్రుల అనుమతి లేకుండా హడావుడిగా దహనం చేయడం కలకలం రేపింది. తమ బిడ్డపై కాటికాపరి అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి కుటుంబసభ్యులు నిరసన చేపట్టారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం రాహుల్‌గాంధీ చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు.

'ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒక్కటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని ఆరాటపడుతున్నారు. వారికి మేం అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకూ వారి తరఫున పోరాడతాం' అని రాహుల్‌ హామీ ఇచ్చారు.

అటు.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా చిన్నారి కుటుంబాన్ని కలవనున్నారు.

మరోవైపు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్​పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

రూ. 10 లక్షలు పరిహారం..
అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల దళిత చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందించనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.

నీళ్లు తెస్తానని వెళ్లి...

దిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం సమయంలో అక్కడ ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి వద్దకు వచ్చి బాలిక మరణించినట్లు చెప్పాడు. వాటర్‌ కూలర్‌ నుంచి నీళ్లు పడుతున్న సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలిందని చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని దహనం చేయించాడు. అయితే రాధేశ్యామ్‌ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్‌ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తమ ఇంటివద్దే న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: 'కేంద్రంపై ఐక్యంగా ఉద్యమిద్దాం'

Last Updated :Aug 4, 2021, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.