సోనియా గాంధీకి ఘనంగా వీడ్కోలు.. ప్రియాంక ఎమోషనల్‌ పోస్ట్‌

author img

By

Published : Oct 26, 2022, 10:14 PM IST

priyanka gandhi on sonia gandhi

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీకి ఆ పార్టీ ఘనంగా వీడ్కోలు పలికింది. దీనిపై స్పందించిన ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ భావోద్వేగ పోస్ట్ చేశారు.

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గేకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఖర్గే.. సోనియాకు రాజీవ్‌ గాంధీ చిత్రాన్ని బహూకరించారు. దాన్ని సోనియా గాంధీ పైకెత్తి చూపిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. ఈ చిత్రాన్ని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ .. 'నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా! ప్రపంచం ఏమనుకున్నా.. ఏం ఆలోచించినా సరే. నాకు తెలుసు ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌ అని!' అంటూ రాసుకొచ్చారు.

సోనియా గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘనంగా వీడ్కోలు పలికింది. పార్టీ తరఫున ఆ పార్టీ నేత అజయ్‌ మాకెన్‌ వీడ్కోలు ప్రకటనను చదివి వినిపించారు. దేశం పట్ల ఆమెకున్న ప్రగాఢమైన ప్రేమ నుంచి ఆమె తన రాజకీయ స్ఫూర్తి పొందారని, ప్రజలు కూడా అదే ప్రేమ, అదే నమ్మకాన్ని ఆమెకు తిరిగి ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీలో తన జోక్యం ద్వారా అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మారేలా పార్టీని తీర్చిదిద్దారని కొనియాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో, దూరదృష్టితో ఆమె తీసుకున్న నిర్ణయాలు పార్టీ భవిష్యత్‌కు పునాది వేశాయని ప్రశంసించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 1998 నుంచి 2017 వరకు సోనియా పనిచేశారు. 2019 నుంచి నిన్నటిదాక పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. 1991లో తన భర్త రాజీవ్‌ గాంధీ మరణించే సమయానికి సోనియా గాంధీ రాజకీయాలకు ఆమడ దూరంగా ఉండేవారు. కానీ, పరిస్థితుల ప్రభావం కారణంగా 1997లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ మరుసటి ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. గడిచిన 8 ఏళ్లుగా ప్రతిపక్షంలో కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.