ETV Bharat / bharat

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు- ఈసారి ఆ సీటు ఎవరిని వరిస్తుందో?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 6:03 AM IST

Political Parties Focus on LB Nagar Constituency : రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గ పోరు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడి ఓటర్ల తీర్పు ఏ పార్టీ అంచనాలకు అందదు. తటస్థుల ఓటర్లే ఇక్కడ కీలకం కావడంతో ఈ నియోజకవర్గంలో ఏ జెండా ఎగురుతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిముఖ పోరులో అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పటి వరకు బోణి కొట్టలేదు. బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసినా స్థానిక సంస్థల్లో తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గెలుపు అందని ద్రాక్షే. వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తున్నా.. వారు పార్టీ మారడం రివాజుగా మారింది. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎల్బీనగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?.

LB Nagar Constituency
Political Parties Focus on LB Nagar Constituency

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు- ఈసారి ఆ సీటు ఎవరిని వరిస్తుందో?

Political Parties Focus on LB Nagar Constituency : రాష్ట్ర రాజధానికి స్వాగతం పలుకుతూ నగర శివారులో విస్తరించి ఉన్న నియోజకవర్గం.. ఎల్బీనగర్. 11 డివిజన్లతో హయత్ నగర్, వనస్థలిపురం, లింగోజిగూడ, గడ్డిఅన్నారం, బీఎన్​ రెడ్డినగర్, హస్తినాపురం, నాగోల్, మన్సూరాబాద్ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎల్బీనగర్‌ ఓటరు అంచనాలకు అందని తీర్పులతో అభ్యర్థులను అయోమయంలో పడేస్తారు. ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సామరంగారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరేకాక మరో 45 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు ఎల్బీనగర్ బరిలో నిలబడ్డారు.

Political Parties Election Campaign 2023 : ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. లక్ష మందికి పైగా ఉన్న తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. విజయావకాశాలు ఆ ఓటర్ల వారిదే విజయం. ఎల్బీనగర్​కు పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాదికి చెందిన వారూ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారందరూ ఓటేస్తారా..? లేక తటస్థంగా ఉంటారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.

ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

Telangana Assembly Elections 2023 : చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, గడ్డి అన్నారం, చంపాపేట్, లింగోజిగూడ డివిజన్లలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెటిలర్లు ఎక్కువగా ఉన్న వనస్థలిపురం, బీఎన్​రెడ్డి నగర్, హస్తినాపురం, హయత్ నగర్ డివిజన్లపై కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి సారించింది. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పోటీ లేకపోవడంతో సెటిలర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ధీమాలో ఆ పార్టీ అభ్యర్థి మధుయాస్కీ ఉన్నారు. తుమ్మల నాగేశ్వర్​రావు లాంటి సీనియర్లను రంగంలోకి దింపి కమ్మ సామాజిక వర్గం నేతలతో మంతనాలు సాగించారు. కులాల వారీగా ఆత్మీయ సమావేశాలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

సుధీర్ రెడ్డి వర్సెస్ మధుయాస్కీ : ఇక బీఆర్ఎస్​ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్‌లో మరోసారి పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్​ రెడ్డి.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్​లో చేరారు. ఈసారి గులాబీ కండువాతో బరిలోకి దిగిన సుధీర్ రెడ్డి.. ఏ పార్టీలో ఉన్న గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. నల్గొండ రెడ్ల ఓట్లతో పాటు తెలుగుదేశం ఓట్లపైనా భారీగా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ప్రచారంలో అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆస్తి పన్ను తగ్గింపు, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం, 42 కాలనీలకు రిజిస్ట్రేషన్ సమస్య శాశ్వత పరిష్కారం, పైవంతెనల నిర్మాణం, చెరువుల సుందరీకరణ సుధీర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ ఫిరాయించాడనే విమర్శలు ప్రతికూలం. రాంమోహన్ గౌడ్ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓట్లు కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎల్బీనగర్‌లో బీజేపీ బలమైన పోటీ ఇస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్లలో ఆ పార్టీ తన కార్పొరేటర్లను గెలిపిచుకుంది. 16 ఏళ్లుగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నానని, ఒకసారి అవకాశం కల్పించాలని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఓటర్లను వేడుకుంటున్నారు. ఎల్బీనగర్ ఓటర్ల తీర్పు.. ఈసారి ఎలా ఉంటుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్కంఠతో ఉన్నారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తా : సామ రంగారెడ్డి

కాంగ్రెస్​కు ఎల్బీనగర్ కంచుకోట : మధుయాష్కీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.