ETV Bharat / bharat

'ఇప్పటికే కొరత- కొవిడ్​ ఔషధాల నిల్వ తగదు'

author img

By

Published : May 17, 2021, 6:29 PM IST

Delhi High Court
దిల్లీ న్యాయస్థానం, హైకోర్టు

కొవిడ్​-19 ఔషధాలను నిల్వచేసి సొమ్ము చేసుకునేందుకు రాజకీయ నాయకులకు వీల్లేదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైరస్​ బారినపడి పేద ప్రజలు.. ఔషధాల కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. వాటిపై రాజకీయంగా లాభాలు ఆర్జించడం తగదని పేర్కొంది. దిల్లీలో రెమ్​డెసివిర్, ఇతర ఔషధాలను నిల్వచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. పోలీసులు చేపట్టిన విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం.

దేశంలో కొవిడ్​ ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడిన తరుణంలో.. రాజకీయ నాయకులు వాటిని నిల్వచేసి వ్యాపారం చేయడం తగదని దిల్లీ హైకోర్టు తెలిపింది. వారి వద్దనున్న ఔషధాలను వెంటనే ఆరోగ్య సేవా విభాగానికి అప్పగించాలంది కోరింది. రాజకీయ నాయకులు దేశ రాజధానిలో రెమ్​డెసివిర్​ సహా.. ఇతర ఔషధాలను నిల్వచేసి పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోర్టు గతంలో పోలీసులకు సూచించింది. అయితే.. సరైన దర్యాప్తు చేపట్టకుండానే నివేదికను సమర్పించారని అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం.

'ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నందున మీరు సరైన దర్యాప్తు చేయలేదు. మేము దీన్ని సమ్మతించం. ఆరోపణలు వచ్చిన ప్రతి వ్యక్తిపై సరైన విచారణ జరిపి.. తగిన నివేదిక సమర్పించి ఉంటే మిమ్మల్ని అభినందించేవాళ్లం' అని కోర్టు తెలిపింది. ఈ విషయంలో బాధిత వ్యక్తులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసులకు సూచించింది. కరోనా ఔషధాల కోసం ప్రజలు విలవిల్లాడుతున్న తరుణంలో.. వీటిని రాజకీయ నాయకులు తమ స్వలాభాపేక్ష కోసం నిల్వచేయరని తాము ఆశిస్తున్నట్టు పేర్కొంది.

'ప్రజాసేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం'

"రాజకీయ నాయకులు కొవిడ్ ఔషధాలను నిల్వ చేసేందుకు వీల్లేదు. అలా చేసినవారు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ హెల్త్​ సర్వీసెస్​(డీజీహెచ్​ఎస్​)కు వాటిని అప్పగించాలని కోరుతున్నాం. ఆ మందులను ప్రభుత్వ ఆస్పత్రులలోని పేదలకు సరఫరా అయ్యేలా చేస్తాం. ప్రజాసేవ చేసేందుకు వారికిది ఉత్తమ మార్గం." అని జస్టిస్​ విపిన్​ సంఘీ, జస్టిస్​ జాస్మిత్​ సింగ్​ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ప్రజలకు సేవ చేయాలనేదే వారి ఉద్దేశమైతే.. అలాంటి వారు స్వయంగా వెళ్లి తమ వద్దనున్న నిల్వలను డీజీహెచ్​ఎస్​కు అప్పగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే.. ఈ విషయంలో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్​తో సహా.. ఇతర రాజకీయ నాయకులు ప్రజలకు మందులు, ఆక్సిజన్​, వైద్య సాయం అందించడంలో తమ వంతు సహకారం అందిస్తున్నారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందుకోసం వారు డబ్బులు వసూలు చేయడంలేదని, ఎలాంటి మోసాలకు పాల్పడటంలేదని అందులో వివరించారు.

ఇదీ చదవండి: 'ప్రైవసీ పాలసీతో ఐటీ చట్టం ఉల్లంఘన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.