ETV Bharat / bharat

Police Gets Justice After 29 Years : చేయని నేరానికి 29 ఏళ్ల శిక్ష.. క్షమాపణలు కోరిన పోలీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 11:01 PM IST

Police Gets Justice After 29 Years : చేయని నేరానికి 29 ఏళ్లు శిక్ష అనుభవించారు ఓ మాజీ ఎస్​ఐ. తాజాగా ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కోల్​కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ మాజీ ఎస్ఐ.

Police Gets Justice After 29 Years
Police Gets Justice After 29 Years

Police Gets Justice After 29 Years : చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఓ మాజీ ఎస్​ఐని నిర్దోషిగా ప్రకటిస్తూ.. 29 ఏళ్ల తర్వాత కోల్​కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పు కాస్త ఆలస్యంగా వచ్చినా న్యాయం జరిగినందుకు ఆ మాజీ ఎస్​ఐ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగింది.. సైలేన్ దాస్ (70) అనే వ్యక్తి 1993లో కోల్​కతా పోలీస్​ శాఖ ఈఎస్​డి డివిజన్ ఎస్​ఐగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఓ కేసులో సైలేన్​దాస్ ప్రమేయం ఉందని ఉన్నతాధికారులు భావించారు. సైలేన్​దాస్​పై శాఖా పరమైన విచారణ చేపట్టి.. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సైలేన్​దాస్ అంగీకరించలేదు. తనతప్పేమి లేదని స్టేట్​ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్- ఎస్​ఏటీ​లో ఫిర్యాదు చేశారు. అయితే సైలేన్​దాస్ చేసిన అభ్యర్థనను ఎస్​ఏటీ తిరస్కరించింది. దీంతో పట్టువదలని సైలన్​దాస్​ ట్రైబ్యునల్ తీర్పును కోల్​కతా హైకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియలో కేసు ఎంతకాలానికి పరిష్కారమవుతుందో సైలేన్​దాస్​కు తెలియదు. ఆయన ఆర్థిక స్థోమత కూడా న్యాయపోరాటానికి సహకరించలేదు. దీంతో తనకు జీవనోపాధి అయిన ఉద్యోగంపై ఆశలు వదులుకున్నారు. అప్పటికే అనారోగ్య కారణాలతో ఆయన మంచం పట్టారు.

అయితే మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత కోల్​కతా హైకోర్టు ఆయనకు శుభవార్త తెలిపింది. సైలేన్​ దాస్​ను నిర్దోషిగా ప్రకటించి తీర్పు వెలువరించింది. దాస్​ను ఎక్కడున్న కనుక్కోవాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో సైలేన్​దాస్​కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించి.. కేసు మొత్తం వ్యవహారాన్ని కోర్టుకు నివేదించారు. పోలీసులు అన్ని ఫైళ్లు తిరగేసి అతికష్టంమీద సైలేన్​దాస్ చిరునామా కనుక్కొగలిగారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు సైలేన్​దాస్​ ఇంటికి కారు పంపించి పోలీసు కార్యాలయానికి పిలిపించారు. ఆయన కేసు ఫైళ్లు అన్ని పరిశీలించి దాస్​ బాధితుడని ప్రకటించారు. తప్పు జరిగిపోయిందని పోలీసులు సైలేన్​దాస్​ను క్షమాపణలు కోరారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు సైలేన్​దాస్​కు రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందివ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే.. కాస్త ఆలస్యంగానైనా కోర్టు తనకు న్యాయం చేసినందుకు మాజీ పోలీస్ ఆనందం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.