ETV Bharat / bharat

'మహిళల వివాహ వయస్సు పెంపు.. వారికి నచ్చట్లేదు'

author img

By

Published : Dec 21, 2021, 3:36 PM IST

Updated : Dec 21, 2021, 4:50 PM IST

Modi UP Visit: ఉత్తర్​ ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రయాగ్​ రాజ్​లో కన్యా సుమంగళ యోజనను ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.1,000 కోట్లు జమ చేశారు. బాలికల సంరక్షణ కోసం మరో రూ.20కోట్లపైగా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళల వయస్సు పెంపు నిర్ణయం కొందరికి నచ్చట్లేదని పరోక్షంగా విపక్షాలకు చురకలు అంటించారు.

modi prayagraj visit
మోదీ ప్రయాగ్​ రాజ్​ విజిట్​

Modi UP Visit: మహిళా సాధికారత, బాలికల సంరక్షణ దిశ కీలక చర్యలు చేపట్టింది భాజపా సర్కారు. రూ.1000 కోట్లు స్వయం సహాయక బృందాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనిద్వారా 16 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. దీన్​దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద భారీ మొత్తం విడుదల చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న మోదీ.. ప్రయాగ్​రాజ్​లో కన్యా సుమంగళ యోజనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. ఈ పథకం యూపీ ఆడపడుచులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు లక్షల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, మథురా ఎంపీ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు.

  • #WATCH | A large number of women gathered in Prayagraj for the one of its kind program welcome PM Narendra Modi. The program is being held as per the vision to empower women, especially at grassroot level, by providing them with necessary skills, incentives & resources. pic.twitter.com/oheNsrE3yz

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలికల సంరక్షణ కోసం మరో రూ.20 కోట్లపైగా విడుదల చేశారు. 'ముఖ్యమంత్రి కన్యా సుమంగళ పథకం' కింద విడుదల చేసిన ఈ మొత్తం ద్వారా లక్షమందికిపైగా లబ్ధి పొందుతారు. లబ్ధిదారులకు రూ.15,000 చొప్పున అందజేస్తారు.

దిల్లీకి దగ్గరి దారిగా భావించే.. ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుసగా భారీ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది భాజపా సర్కారు. ఈ క్రమంలోనే 43 జిల్లాల్లో 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్ తయారీ యూనిట్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్లకు స్వయం సహాయక సంఘాలు నిధులు సమకూరుస్తాయి. ఒక్కో యూనిట్‌ను రూ.కోటి వ్యయంతో నిర్మించనున్నారు.

ప్రతిపక్షాలపై ధ్వజం

వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచుతూ తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. అయితే ఇది కొందరికి ఇబ్బందిగా ఉందని ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు ప్రధాని.

"మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచేందుకు కృషి చేస్తున్నాం. తద్వారా వారి చదువు, పురోగతికి అవకాశముంటుంది. దేశంలో ఆడపడుచుల కోసం మా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటోంది. అయితే ఇది కొందరికి సహించడం లేదు."

- ప్రధాని నరేంద్ర మోదీ

మహిళ వయసుపై కొందరు సమాజ్​వాదీ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఐదేళ్ల క్రితం యూపీలో మాఫియా రాజ్యమేలిందని.. ఆ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. యోగి సర్కారు.. బాలికల అభ్యున్నతికి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు.

ఇవీ చూడండి:

టీఎంసీదే 'కోల్​కతా' పీఠం.. భాజపాపై దీదీ సెటైర్​!

మహిళపై 'గాడ్‌మ్యాన్' అత్యాచారం.. గర్భవతిని చేసి..

Last Updated :Dec 21, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.