ETV Bharat / bharat

మహాకాల్​ లోక్ కారిడార్​ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని

author img

By

Published : Oct 11, 2022, 7:22 PM IST

Updated : Oct 11, 2022, 7:52 PM IST

మధ్యప్రదేశ్​లోని శ్రీ మహాకాల్​ లోక్ కారిడార్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కారిడార్ తొలి దశను ఆవిష్కరించిన మోదీ.. దాన్ని జాతికి అంకితమిచ్చారు.

MODI MAHAKAL LOK
MODI MAHAKAL LOK

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్‌ కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో... ఆలయానికి చేరుకున్న మోదీ.. మహాకాళుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కారిడార్‌ను ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్‌ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్ అయిన 'మహాకాల్ లోక్‌'ను.. భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేవిధంగా తీర్చిదిద్దారు.

2017లో ఈ ప్రాజెక్టు మొదలుకాగా.. గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులు నిర్మాణాలను తీర్చిదిద్దారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40-45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. శిప్రా నదీతీరాన వెలసిన ఉజ్జయినికి అవంతిక అనే పురాతన నామధేయం ఉంది. దిగ్గజ పాలకుడు విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు.

రెండు ద్వారాలు
మహాకాల్‌ లోక్‌ భక్తులకు స్వాగతం పలుతున్నట్టుగా రెండు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నందీ ద్వార్‌.. ఎత్తయిన రెండు నందులు.. భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకో ద్వారం పేరు పినాకి ద్వార్‌.. ఈ ద్వారంపైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షుసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. బ్రహ్మ రథసారధిగా ఉండగా.. పరమేశ్వరుడు ధనుస్సు చేతబట్టి.. త్రిపురాసురులను ఒకే బాణంతో అంతం చేస్తాడు. ఆ ఘట్టాన్ని వివరించేలా చెక్కిన శిల్పం.. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.

లోపలికి వెళ్తే..
ఈ ద్వారాల నుంచి లోపలికి అడుగుపెట్టగానే మనం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తాం. 108 రాజస్థాన్‌ రాతి స్తంభాలు మనకు స్వాగతం పలుకుతాయి. జలయంత్రాలు.. 50కు పైగా శివపురాణాన్ని తెలిపే కుడ్యచిత్రాలు.. మనల్ని అబ్బురపరుస్తాయి. నంది, భైరవ, గణేశ, పార్వతి మాత సహా ఇతర దేవతల విగ్రహాలు మనకి భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. మహాకాల్ లోక్‌లో.. కమల్ సరోవర్ ప్రత్యేక ఆకర్షణ. ఈ సరస్సులో చుట్టూ కమలాలను ఏర్పాటు చేయగా.. మధ్యలో ధ్యానముద్రలో పరమశివుడు కొలువు దీరాడు. నీల కంఠుడి చుట్టూ సింహాలను ఏర్పాటు చేశారు. కమల్‌ సరస్సులో ఏర్పాటు చేసిన కృత్రిమ కమలాలు.. ఆకట్టుకుంటాయి.

పరమ శివుడి చుట్టూ సప్త రుషుల.. విగ్రహాలు ఏర్పాటు చేశారు. కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ రుషుల ప్రతిమలను కూడా ఈ మహాకాల్‌ లోక్‌లో ఏర్పాటు చేశారు. సప్తఋషులు తమ తపస్సుతో లోకంలో సుఖశాంతులు నెలకొల్పారని ప్రతీతి. అందుకే ధ్యానముద్రలో ఉన్న రుషుల విగ్రహాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. శివపురాణంలోని వివిధ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపుతున్న 50కు పైగా కుడ్యచిత్రాలు ఆధ్యాత్మిక లోకంలోకి మనల్ని తీసుకువెళతాయి. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40 నుంచి 45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో మహాకాల్‌ దీప్‌ దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న.. ఉజ్జయినిలో మహాకాలేశ్వర్‌ ఆలయం పక్కనే ఉన్న రుద్రసాగర్‌ సరస్సును పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. 2017లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తొలి దశ పనులు పూర్తికాగా రెండో దశ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. చారిత్రక నగరం ప్రాచీన వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఘన చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకు మహాకాల్‌ లోక్‌ను అభివృద్ధి చేసిననట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శిప్రా నదీతీరాన వెలసిన ఉజ్జయినికి అవంతిక అనే పురాతన నామం ఉంది. దిగ్గజ పాలకుడు విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు.

Last Updated :Oct 11, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.