ETV Bharat / bharat

ఎన్నికల ప్రణాళికల అమలు బాధ్యత రాజకీయ పార్టీలదే!

author img

By

Published : Feb 20, 2022, 5:41 AM IST

Supreme Court: ఎన్నికల వాగ్దానాల అమలుకు రాజకీయ పార్టీలను జవాబుదారీ చేయాలని అభ్యర్థిస్తూ.. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది! హామీలను నెరవేర్చకుంటే వాటి గుర్తింపును రద్దు చేయాలని అందులో కోరారు పిటిషనర్‌.

election manifesto
Supreme Court

Supreme Court: ఎన్నికల ప్రణాళికలను నియంత్రించాలని, వాటిలో పేర్కొన్న వాగ్దానాల అమలుకు రాజకీయ పార్టీలను జవాబుదారీ చేయాలని అభ్యర్థిస్తూ.. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది! ఆ దిశగా చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాది అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యే రాజకీయ పార్టీల గుర్తింపును, ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని కోరారు.

"ఎన్నికల మ్యానిఫెస్టో అన్నది విజన్‌ డాక్యుమెంట్‌. ఫలానా పార్టీ అధికారం చేపట్టిన తర్వాత.. నిర్దిష్టంగా కొన్ని హామీలను నెరవేర్చుతుందని ప్రజలు మ్యానిఫెస్టోల ద్వారా విశ్వసించి, ఆశించి, వాటి అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. కొన్ని పార్టీలు అతిశయోక్తితో కూడిన వాగ్దానాలు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతోంది. మరికొన్ని వాగ్దానాలు అవినీతితో ముడిపడి ఉంటున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలను- రాజకీయ పార్టీల ఉద్దేశాలతో పాటు, అధికారం చేపట్టిన తర్వాత అవి నెరవేర్చబోయే నిర్దిష్ట హామీలకు రాతపూర్వక ప్రచురిత దార్శనికపత్రాలుగా ప్రకటించాలి. వీటిని చట్టబద్ధంగా అమలుచేయాలి. ఈ విషయంలో మార్గదర్శకాలు జారీచేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి" అని పిటిషనర్‌ అభ్యర్థించారు.

'ఉచితాలతో ఓటర్లను ప్రలోభపెట్టే పార్టీలపై కేసులు నమోదు చేయాలి'

ఉచిత హామీలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న రాజకీయ పార్టీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ హిందూసేన ఉపాధ్యక్షుడు సూర్జిత్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. "ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఉచిత హామీలు ప్రకటించాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 123(1)(బి) ప్రకారం- ఇలాంటి హామీలిచ్చిన పార్టీలు, నేతలు, అభ్యర్థులను.. అక్రమాలకు, లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించాలి. ఆయా అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు, రాజకీయ పార్టీల అవకతవకలను అడ్డుకునేందుకు ఈ చర్యలు అవసరం. నామినేషన్ల దాఖలు సమయంలోనే.. తాము ఎలాంటి ఉచిత హామీలు ఇవ్వలేదని అభ్యర్థుల నుంచి ఎన్నికల సంఘం డిక్లరేషన్‌ తీసుకోవాలి" అని పిటిషనర్‌ అభ్యర్థించారు.

ఇదీ చూడండి: Punjab polls: పంజాబ్​ ఎన్నికలకు సర్వం సిద్ధం.. గెలుపుపై పార్టీల ధీమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.