ETV Bharat / bharat

'లోక్​సభ ఘటన'పై అట్టుడికిన పార్లమెంట్- 14 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్

author img

By PTI

Published : Dec 14, 2023, 2:37 PM IST

Updated : Dec 15, 2023, 12:12 PM IST

Parliament Security Breach MPs Suspend : పార్లమెంట్​లో బుధవారం నాటి ఘటనపై ఉభయ సభలు దద్దరిల్లాయి. ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనుచిత ప్రవర్తన కారణంగా ఉభయసభల్లో మొత్తం 14 మంది ఎంపీలపై వేటు పడగా- నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది భద్రతా సిబ్బందిని లోక్​సభ సెక్రెటేరియట్ సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝా అరెస్ట్​కు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Parliament Security Breach MPs Suspend
Parliament Security Breach MPs Suspend

Parliament Security Breach MPs Suspend : లోక్​సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆందోళనలతో ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మొత్తం 14 మంది ఉభయసభల ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో 13 మంది లోక్​సభ సభ్యులు కాగా ఒకరు రాజ్యసభ ఎంపీ.

లోక్​సభలో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించడం వల్ల టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్. జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. కాసేపు విరామం అనంతరం మధ్యాహ్నం 3 తర్వాత మళ్లీ సభ ప్రారంభమైనా ఎంపీలు నిరసనలు ఆపలేదు. దీంతో సభాకార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్న మరో 9మందిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు ప్రహ్లద్ జోషి. బెన్నీ బెహనాన్, వీకే శ్రీకందన్, మహ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కే సుబ్రహ్మణ్యం, ఎస్ వెంకటేశన్, మాణిక్యం ఠాగూర్ సస్పెండ్ అయ్యినవారిలో ఉన్నారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనల నేపథ్యంలో లోక్​సభ శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభలో లేని ఎంపీ పార్థిబన్​ పేరును సైతం తొలుత సస్పెండ్ అయిన జాబితాలో చేర్చారు. అయితే, అది సిబ్బంది పొరపాటు వల్ల జరిగిందని తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి వివరణ ఇచ్చారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్​పై వేటు పడింది.

  • #WATCH | Five Congress Lok Sabha MPs- TN Prathapan, Hibi Eden, S Jothimani, Ramya Haridas and Dean Kuriakose- suspended from Lok Sabha for the rest of the session for "unruly conduct" pic.twitter.com/jsk5DNR0jR

    — ANI (@ANI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Opposition MPs- Benny Behanan, VK Sreekandan, Mohammad Jawed, PR Natarajan, Kanimozhi Karunanidhi, K Subrahmanyam, SR Parthiban, S Venkatesan and Manickam Tagore-suspended from Lok Sabha for the rest of the session for "unruly conduct"

    House adjourned till tomorrow. pic.twitter.com/gThKY50P7P

    — ANI (@ANI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దు'
అంతకుముందు ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్యే కేంద్రమంత్రి ప్రహ్లోద్ లోక్​సభ భద్రతా ఉల్లంఘనపై మాట్లాడారు. లోక్​సభలో భద్రతా ఉల్లంఘనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ఆ అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్​ ఛాంబర్​లో బుధవారం జరిగిన దురదృష్టకర ఘటన ఎంపీల భద్రతకు సంబంధించి తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫ్లోర్ లీడర్‌లతో సమావేశం నిర్వహించి పార్లమెంట్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు విపక్షాల సూచనలు విన్నారని జోషి పేర్కొన్నారు. ఎంపీలు ఇచ్చిన కొన్ని సూచనలను ఇప్పటికే అమలు చేశామని, భవిష్యత్తులో కూడా పార్లమెంట్ భద్రతను మరింత పటిష్ఠంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్వయంగా చెప్పారని జోషి గుర్తు చేశారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడం కొంతమంది సభ్యులకు అలవాటుగా మారిందని విపక్షాలకు కౌంటర్ వేశారు ప్రహ్లోద్ జోషి.

'లోక్​సభ ఛాంబర్​లో జరిగిన ఘటన ఎంపీలందరికీ సంబంధించినది. ఆ సమస్యపై అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఇటువంటి జాతీయ సమస్యపై ఎవరూ రాజకీయాలు చేయరు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై అత్యున్నత స్థాయి విచారణ కోసం హోంశాఖ కార్యదర్శికి స్పీకర్ లేఖ రాశారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది.' అని ప్రహ్లోద్ జోషి లోక్​సభలో మాట్లాడారు.

డెరెక్​పై వేటు
మరోవైపు, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. ఉదయం 11గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. విపక్ష సభ్యులు తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని ఛైర్మన్‌ జగ్దీప్ ధన్​ఖడ్ సూచించారు. అందుకు టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ తిరస్కరించారు. డెరెక్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్‌ఖడ్‌- ఆయన ప్రవర్తన ఛైర్మన్ అధికారాలను ధిక్కరించేలా ఉందన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ డెరెక్‌ ఒబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు మద్దతు పలకగా ఈ సెషన్‌ ముగిసే వరకు డెరెక్​ను సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్ ధన్‌ఖడ్‌ ప్రకటించారు.

  • Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" pic.twitter.com/A3MVk0Top9

    — ANI (@ANI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'కాంగ్రెస్​-లెఫ్ట్​కు సంబంధం ఉంది'
పార్లమెంట్ వెలుపల సైతం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సెక్యూరిటీ ఉల్లంఘన ఘటనతో కాంగ్రెస్-కమ్యూనిస్టులకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో క్రియాశీలంగా పాల్గొన్న వారు గతంలోనూ అనేక నిరసనలు చేశారని బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ఎక్స్​లో ఆరోపించారు.

మరోవైపు, నిందితులకు పాస్​లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి రెండు సభల్లో వివరణ ఇవ్వాలని, అనంతరం చర్చకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎక్స్ పోస్ట్​లో డిమాండ్ చేశారు. విపక్షాలు చేస్తున్న న్యాయబద్ధమైన డిమాండ్లను మోదీ సర్కారు పట్టించుకోకపోవడం వల్లే పార్లమెంట్​ వాయిదా పడుతోందని వ్యాఖ్యానించారు.

ఎనిమిది మంది సస్పెండ్
బుధవారం నాటి ఘటనపై లోక్​సభ సెక్రెటేరియట్ చర్యలు తీసుకుంది. పార్లమెంట్‌ భద్రతా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. సస్పెండ్ అయిన వారిలో రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేశ్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు.

మోదీ సమీక్ష
పార్లమెంటులో చెలరేగిన అలజడిపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఉదయం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశానికి హాజరయ్యారు.

ఆరో నిందితుడి అరెస్ట్ కోసం ప్రయత్నాలు
పార్లమెంట్​ భద్రతా ఉల్లంఘన ఘటనలో కీలక నిందితుడిగా భావిస్తున్న ఆరో వ్యక్తి లలిత్​ ఝాను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లలిత్ కోల్​కతాకు చెందిన వ్యక్తి కాగా, అతడు టీచర్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. భగత్​సింగ్ స్ఫూర్తితో ఈ ఘటనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వారికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన తర్వాత నిందితులంతా భగత్​సింగ్ ఫ్యాన్ పేజీలో చేరారని వివరించారు.

'లలిత్, సాగర్ శర్మ, మనోరంజన్ ఏడాది క్రితం మైసూరులో కలిశారు. పార్లమెంట్​లోకి వెళ్లేందుకు అప్పుడే ప్లాన్ వేసుకున్నారు. తర్వాత నీలమ్, అమోల్​ను తమలో చేర్చుకున్నారు. టీచర్​గా పనిచేసే లలిత్ వీరికి నాయకత్వం వహించాడు. పార్లమెంట్ ఎంట్రీ పాయింట్ల వద్ద రెక్కీ నిర్వహించాలని వర్షాకాల సమావేశాల సందర్భంగా మనోరంజన్​కు సూచించాడు. జులైలో దిల్లీకి వచ్చిన మనోరంజన్ ఓ ఎంపీ ఇచ్చిన విజిటర్ పాస్​తో పార్లమెంట్ లోపలికి వెళ్లాడు. షూలను ఎవరూ తనిఖీ చేయడం లేదని నిర్ధరణకు వచ్చాడు.

మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతం నుంచి కలర్ క్యానిస్టర్లను అమోల్ తీసుకొచ్చాడు. బుధవారం లలిత్ మరో నలుగురితో పార్లమెంట్ వద్దకు వచ్చాడు. రెండే పాసులు ఉండటం వల్ల మనోరంజన్, సాగర్ పార్లమెంట్ లోపలికి వెళ్లారు. ముందుగానే లలిత్ అందరి మొబైల్ ఫోన్లు తీసుకున్నాడు. నీలమ్, అమోల్ బయట గేటు వద్ద ఉండిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో లలిత్ పోస్ట్ చేశాడు. విశాల్ శర్మ అలియాస్ విక్కీ అనే వ్యక్తికి వీటిని షేర్ చేశాడు. అతడు కూడా ఈ బృందంలో సభ్యుడే. లలిత్ చివరి లొకేషన్ రాజస్థాన్​లో కనిపించింది' అని ఓ అధికారి వివరించారు.

భద్రత కట్టుదిట్టం- ఎంపీలకు మాత్రమే ఎంట్రీ!
Parliament Complex Security Tightened : బుధవారం నాటి ఘటన నేపథ్యంలో పార్లమెంట్​లో సెక్యూరిటీని మరింత పెంచారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పూర్తిగా తనిఖీ చేశారు. పార్లమెంట్ భవనానికి దూరంగానే బ్యారికేడ్లు ఉంచిన భద్రతా సిబ్బంది- ఐడీ కార్డులు తనిఖీ చేశాకే లోపలికి అనుమతించారు. మకర ద్వారం నుంచి ఎంపీలను మాత్రమే అనుమతించారు. ఎంపీల డ్రైవర్లు బయటే ఉండిపోయారు. మీడియాను పాత భవనం గేట్ నం.12 వద్దకు తరలించారు. పార్లమెంట్ వద్దకు వచ్చిన మేఘాలయా సీఎం కాన్రాడ్ సంగ్మాను సైతం మకర ద్వారం నుంచి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో కారు దిగిన ఆయన నడుచుకుంటూ శార్దూల్ ద్వారం నుంచి లోపలికి వెళ్లారు. మరోవైపు.. కొందరు పాఠశాల విద్యార్థులను పార్లమెంటు సందర్శనకు అనుమతించారు.

Last Updated :Dec 15, 2023, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.