ETV Bharat / bharat

'ఇదేం పద్ధతి?.. అప్పటివరకు నేను సభకు రాను!'.. ఎంపీల తీరుపై స్పీకర్​ అసంతృప్తి

author img

By

Published : Aug 2, 2023, 5:21 PM IST

parliament monsoon session 2023
లోక్​సభకు బుధవారం స్పీకర్ దూరం

లోక్​సభ మళ్లీ వాయిదా పడింది. మణిపుర్ అల్లర్లపై విపక్షాల నిరసనలు బుధవారం కూడా కొనసాగాయి. సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. స్పీకర్ ఓం బిర్లా బుధవారం సమావేశానికి హాజరుకాలేదు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతున్న తీరుతో విసుగు చెందిన లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా.. బుధవారం సభా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షాల ఎంపీలు సభలో హుందాగా నడుచుకునేంత వరకు లోక్​సభకు వచ్చేది లేదని ఆయన ఇరు వర్గాలకు తేల్చి చెప్పారు. మరోవైపు.. విపక్ష సభ్యుల నిరసనలతో సభ గురువారానికి వాయిదా పడింది.

జులై 20న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు నుంచే సభలో పదే పదే అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఆయా బిల్లులు ఆమోదించే సందర్భంలో.. అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పట్ల స్పీకర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని పార్లమెంట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఇదివరకే ఇరు పక్షాల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. స్పీకర్ ఎల్లప్పుడూ సభా గౌరవాన్ని కాపాడతారని.. అలాగే సభ్యులు కూడా సభా మర్యాదలను కాపాడాలని ఆయన ఆశిస్తారని లోక్​సభ అధికారులు స్పష్టం చేశారు.

లోక్​సభ గురువారానికి వాయిదా..
మరోవైపు లోక్​సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపుర్ అంశంపై విపక్షాలు నిరసన కొనసాగించడం వల్ల.. బుధవారం చర్చ జరగకుండానే.. సభ గురువారానికి వాయిదా పడింది. మధ్యాహ్న భోజన సమయానికి ముందు ప్రతిపక్ష సభ్యులు.. వెల్​లోకి దూసుకొచ్చారు. అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపుర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు.

దీంతో సభను నడుపుతున్న బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి.. సభా మర్యాదలు కాపాడాలని సభ్యులకు సూచించారు. వారు పదే పదే అంతరాయం కలిగించడం వల్ల సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 'గవర్నమెంట్ ఆఫ్​ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ 2023' సవరణ బిల్లును బుధవారం సభలో.. ఆమోదించాల్సి ఉంది. కానీ ప్రతిపక్షాల అంతరాయం వల్ల సాధ్యపడలేదు.

ఎలాంటి చర్చ లేకుండానే లోక్​సభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఇది ప్రభుత్వ ప్రాయోజిత వాయిదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాజ్యసభను నడిపిన పీటీ ఉష..
ఉప రాష్ట్రపతి​ జగదీప్ ధన్​ఖడ్ గైర్హాజరీలో.. బీజేపీ ఎంపీ పీటీ ఉష.. బుధవారం రాజ్యసభకు నేతృత్వం వహించారు. కాసేపు సభా కార్యకలాపాలు పర్యవేక్షించారు.
కాగా రాజ్యసభలో ప్రతిపక్ష కూటమి ఇండియా సభ్యులు.. మణిపుర్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం రెండోసారి సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాలను మాట్లడనివ్వడం లేదంటూ కూటమి పార్టీల సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.