ETV Bharat / bharat

భారత్​లో 'ఎక్స్​ఈ' వేరియంట్​ కలకలం.. గుజరాత్​లో బయటపడ్డ వైరస్

author img

By

Published : Apr 9, 2022, 11:42 AM IST

Updated : Apr 9, 2022, 7:05 PM IST

Omicron XE
ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ

Omicron XE Variant in India: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ 'ఎక్స్‌ఈ' కేసు గుజరాత్​లో బయటపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్​లో ఇది నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రసుతం వైరస్​ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని, అతన్ని కలిసిన మరో ముగ్గురికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించింది.

Omicron XE Variant in India: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోన్న సమయంలో కొత్త వేరియంట్‌ 'ఎక్స్‌ఈ' కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్‌ 'ఎక్స్‌ఈ' కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారికారులు వెల్లడించారు. ఇది ఎక్స్‌ఈ వేరియంటేనని జీనోమ్​ సీక్వెన్సింగ్​లో స్పష్టంగా తెలిసిందని వెల్లడించింది.

ఎక్స్‌ఈ వేరియంట్ సోకిన వ్యక్తి నమూనాలను మొదట గాంధీనగర్​లోని జీనోమ్ సీక్వెన్సింగ్​ ల్యాబ్​కు పంపినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వివరించింది. అక్కడ పాజిటివ్​గా తేలిన తర్వాత మరోసారి నిర్ధరించుకునేందుకు నమూనాలను కోల్​కతాలోని ల్యాబ్​కు పంపామని, అక్కడ కూడా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చెప్పింది. అయితే వైరస్​ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి కొత్త లక్షణాలు లేవని స్పష్టం చేసింది. సదరు వ్యక్తి మార్చి 13న కొవిడ్‌ బారిన పడ్డారని, ఆ తర్వాత కోలుకున్నాక ముంబయికి వెళ్లారని పేర్కొంది. అయితే ఇతన్ని కలిసిన ముగ్గురికి పరీక్షల్లో నెగెటివ్​ వచ్చినట్లు గుజరాత్​ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

ఇటీవల ముంబయిలోని ఓ మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతమున్న ఆధారాలను బట్టి అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనని చెప్పలేమని తెలిపింది. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్‌ జెనెటిక్‌ మేకప్‌.. ఎక్స్‌ఈ మ్యుటెంట్‌తో సరిపోలడం లేదని ఇన్సాకాగ్‌ పరిశోధనలో తెలిసిందని కేంద్రం వెల్లడించింది. అయితే గుజరాత్‌లో వెలుగు చూసిన వేరియంట్‌ ఎక్స్‌ఈ రకమేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఏంటీ ఎక్స్‌ఈ వేరియంట్‌: ఒమిక్రాన్‌లోని రెండు సబ్‌ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్‌ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్‌.. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్‌ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సమాచారం.

ఇదీ చదవండి: 'న్యాయమూర్తులను ప్రభుత్వాలు దూషించడం దురదృష్టకరం'

Last Updated :Apr 9, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.