Abhishek Banerjee School : ఉద్యోగాల స్కామ్​లో దీదీ మేనల్లుడికి సీబీఐ నోటీసులు

author img

By

Published : May 19, 2023, 8:11 PM IST

Updated : May 19, 2023, 9:50 PM IST

CBI Notice To Abhishek Banerjee

Abhishek Banerjee School : బంగాల్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది సీబీఐ. శనివారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించింది.

Abhishek Banerjee School : బంగాల్‌లో దుమారం రేపిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తృణముల్​ కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు కోల్​కతాలోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించింది. సీబీఐ నోటీసుల నేపథ్యంలో అభిషేక్‌ బెనర్జీ తన రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభిషేక్‌ బెనర్జీ దాఖలుచేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు కొట్టివేసిన మరుసటిరోజు ఆయనకు నోటీసులు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బొగ్గు కుంభకోణం వ్యవహారంతో కూడా అభిషేక్​ బెనర్జీకి సంబంధాలున్నాయంటూ మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ ఆయన్ను పలుమార్లు విచారించింది.

"గత కొన్నేళ్లుగా బంగాల్‌లో సీబీఐ అనేక దాడులను నిర్వహిస్తోంది. నాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీబీఐ అధికారులు నిరూపించి నన్ను అరెస్ట్​ చేయాలని సవాల్​ విసురుతున్నాను. నేను చేపట్టిన క్యాంపెయిన్​ తృణమూల్ నబోజోవర్ (తృణమూల్ న్యూ వేవ్) రోడ్​ షోలో మా పార్టీకి దక్కుతున్న ప్రజల మద్దతును చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే మాపై దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతోంది."

- అభిషేక్​ బెనర్జీ, టీఎంసీ నేత

నాపై ఒత్తిడి తెచ్చారు
ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు.. అభిషేక్​ బెనర్జీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో మరో నిందితుడిగా ఉన్న కుంతల్ ఘోష్ దాఖలు చేసిన ఫిర్యాదులో అభిషేక్​ బెనర్జీ పేరును కూడా చేర్చారు సీబీఐ అధికారులు. అయితే ఛార్జ్​షీట్​లో అభిషేక్ బెనర్జీ పేరును ప్రస్తావించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఒత్తిడి తెస్తున్నాయని ఘోష్ ఆరోపించారు.

బీజేపీపై దీదీ ఫైర్​!
తన మేనల్లుడు అభిషేక్​ బెనర్జీకి సీబీఐ అధికారులు శనివారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కుటుంబ సభ్యులుగా భావించే తమ పార్టీ నేతలపై కాషాయ దళం తమ కనుసన్నల్లో పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. కోల్‌కతా బంకురాలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. "కేంద్రంలో బీజేపీ నిరంకుశ పాలన చేస్తుంది. ఆ పార్టీని గద్దె దించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది." అని విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated :May 19, 2023, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.