ETV Bharat / bharat

'మా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదు'

author img

By

Published : Dec 15, 2020, 12:30 PM IST

Updated : Dec 15, 2020, 1:00 PM IST

union minister nitin gadkari
'మా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదు'

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న అన్నదాతలు ఏ మాత్రం పట్టువీడట్లేదు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా వరుసగా 20వ రోజు హస్తిన సరిహద్దుల్లో తమ ఆందోళన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రైతులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, నూతన చట్టాలను అర్థం చేసుకోవాలని అన్నదాతలను కోరారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.

దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు, టిక్రీ వద్ద రైతుల నిరసన కొనసాగుతూనే ఉంది. అయితే.. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సంసిద్ధంగానే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సోమవారం మరోసారి స్పష్టం చేశారు. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఆందోళనపై స్పందించారు. రైతులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, నూతన చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని కోరారు.

చర్చలతోనే రైతుల సమస్య పరిష్కారం

రైతుల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రైతులు చర్చలకు రావాలని, కొత్త చట్టాలను అవగాహన చేసుకోవాలని కోరారు. చట్టాలపై అన్నదాతలు ఇచ్చే సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. కొన్ని శక్తులు ఈ ఆందోళనలను దుర్వినియోగం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని గడ్కరీ ప్రతిపక్షాలనుద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు.

"రైతులకు వ్యతిరేకంగా మేం ఎలాంటి చట్టాలు చేయలేదు. కొత్త చట్టాలతో అన్నదాతలు తమ పంటలను ఎక్కడైనా.. ఎవరికైనా.. ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చర్చలు జరగకపోతే దుష్ప్రచారం, వివాదాలు రేకెత్తే ప్రమాదం ఉంది. అందుకే అన్నదాతలు ప్రభుత్వంతో చర్చలకు రావాలి. అప్పుడు ప్రభుత్వం వారికి అన్ని విషయాలు వివరించగలుగుతుంది. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళనలు సమసి రైతలకు న్యాయం జరగుతుంది. రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది"

--నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి.

గుజరాత్‌ రైతులతో మోదీ భేటీ

రైతుల ఉద్యమం ఉద్ధృతమవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. గుజరాత్‌కు చెందిన రైతు సంఘాలు, నేతలతో మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు దిల్లీ శివారుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కూడా నేడు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై వారు చర్చలు జరపనున్నారు.

ఇదీ చూడండి:'దేశ ఐక్యతలో పటేల్ కృషి మరువలేనిది'

Last Updated :Dec 15, 2020, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.