అక్కడ రోజుకు ఇద్దరు బాలికలపై అఘాయిత్యాలు.. దేశంలో రోజూ 82 హత్యలు

author img

By

Published : Aug 30, 2022, 9:40 PM IST

NCRB Report 2022

NCRB Report 2022: దిల్లీలో గతేడాది సగటున రోజుకు ఇద్దరు బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈ మేరకు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడించింది.

NCRB Report 2022: దేశ రాజధాని దిల్లీలో మహిళలకు భద్రత కొరవడుతోంది. గతేడాది అక్కడ సగటున రోజుకు ఇద్దరు బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈ మేరకు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడించింది. దిల్లీలోనే అత్యధికంగా మహిళలపై నేరాలు జరిగాయి. అంతేగాక, గతేడాది అత్యధికంగా అత్యాచార కేసులు నమోదైన మెట్రోపాలిటన్‌ నగరాల్లోనూ దిల్లీ తొలి స్థానంలో ఉండటం గమనార్హం.

NCRB నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

  • 2021లో దిల్లీలో మహిళలపై నేరాలకు సంబంధించి 13,892 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం 2020 ఏడాది(9,782 కేసులు)తో పోలిస్తే కేసులు 40శాతం మేర పెరిగాయి.
  • దేశవ్యాప్తంగా 19 మెట్రోపాలిటన్‌ నగరాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన మొత్తం 43,414 కేసులు నమోదు కాగా.. ఇందులో 32.20శాతం ఒక్క దిల్లీలోనే చోటుచేసుకున్నాయి.
  • దిల్లీ తర్వాత ముంబయిలో 5,543 కేసులు, బెంగళూరులో 3,127 కేసులు నమోదయ్యాయి.
  • దేశవ్యాప్తంగా గతేడాది 31,677 అత్యాచార కేసులు నమోదవ్వగా.. 31,878 మంది లైంగికదాడుల బాధితులున్నారు.
  • 19 మెట్రోపాలిటన్‌ నగరాల్లో మొత్తంగా 3,208 అత్యాచార కేసులు నమోదవ్వగా.. దిల్లీలో అత్యధికంగా 1226 కేసులు నమోదయ్యాయి.
  • 2021లో దిల్లీలో సగటున ప్రతి రోజు ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు చోటుచేసుకున్నాయి. గతేడాది దేశ రాజధానిలో 833 బాలికలపై అత్యాచార కేసులు నమోదయ్యాయి.
  • దిల్లీ తర్వాత జైపుర్‌లో 502, ముంబయిలో 365 లైంగికదాడుల కేసులు నమోదయ్యాయి.
  • అత్యల్పంగా కోల్‌కతాలో 11, కొయంబత్తూర్‌లో 12, పట్నాలో 30 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
  • ఇతర మెట్రో నగరాలైన ఇండోర్‌లో 165, బెంగళూరులో 117, హైదరాబాద్‌లో 116, నాగ్‌పుర్‌లో 115 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.
  • రాష్ట్రాల వారీగా, రాజస్థాన్‌లో అత్యధికంగా 6,337 అత్యాచార కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా నాగాలాండ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.

దేశంలో రోజూ 82 హత్యలు.. యూపీలోనే అధికం:

  • గతేడాది దేశవ్యాప్తంగా 29,272 హత్య కేసులు నమోదయ్యాయి. 2020లో 29,193 హత్య కేసులు నమోదు కాగా.. అంతకు క్రితం ఏడాది 28,915 కేసులు నమోదయ్యాయి. వీటితో పోలిస్తే 2021లో నమోదైన హత్య కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.
  • ఈ హత్య కేసుల్లో 30,132 మంది బాధితులు కాగా.. దేశంలో రోజుకు సగటున 82మంది చొప్పున హత్యకు గురయ్యారు. మృతుల్లో 1,402 మైనర్లు.. 8,405 మంది మహిళలు ఉన్నారు.
  • అత్యధిక హత్యలు నమోదైన రాష్ట్రాల జాబితాలో మళ్లీ యూపీదే అగ్రస్థానం. 3,717 హత్య కేసులతో వరుసగా మూడోసారి తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో బిహార్‌ (2,799), మహారాష్ట్ర (2,330) ఉన్నాయి. క్రైం రేటు లక్ష జనాభాకు యూపీలో 1.6, బిహార్‌లో 2.3, మహారాష్ట్రలో 1.9గా ఉండగా.. జాతీయ సగటు నేర రేటు 2.1గా ఉంది. ఝార్ఖండ్‌లో నేరాల రేటు 4.1గా ఉండగా.. హరియాణాలో 3.8గా ఉంది.
  • దిల్లీ నగరం వరుసగా మూడో ఏడాది కూడా నేరాల రాజధాని స్థానంలోనే నిలబడింది. 2021లో అక్కడ 454 హత్య కేసులు నమోదయ్యాయి. ముంబయి (162), చెన్నై (161) నగరాలతో పోలిస్తే దిల్లీలో హత్య కేసులు అధికంగా నమోదయ్యాయి.
  • 2021లో దేశంలోని మెట్రో నగరాల్లో 1955 హత్య కేసులు నమోదయ్యాయి. 2020లో నమోదైన 1849 కేసులతో పోలిస్తే ప్రస్తుతం 5.7శాతం పెరిగాయి. మెట్రో నగరాల్లో నేరాల వెనుక ప్రధాన ఉద్దేశం.. తగాదాలు (849 కేసులు), వ్యక్తిగత వైరం (380 కేసులు), ప్రేమ వ్యవహారాలు (122 కేసులు) ఉన్నట్టు నివేదిక తెలిపింది. అదే జాతీయస్థాయిలో తగాదాల సంబంధించిన కేసులు 9765 నమోదు కాగా.. ద్వేషం/ప్రతీకారానికి సంబంధించి 3782 కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: వరదతో మునిగిపోయిన బస్టాండ్​​.. తెప్పల్లో జనం ప్రయాణం

దుస్తుల్లో మూత్రం పోస్తున్నాడని చిన్నారి మర్మాంగాలకు వాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.