ETV Bharat / bharat

ఆ జిల్లాలో మంకీ ఫీవర్ కలకలం.. ఆసుపత్రులకు జనం పరుగులు!​

author img

By

Published : May 6, 2022, 10:36 AM IST

monkey fever in karnataka: మంకీ ఫీవర్​.. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో మరోమారు కలకలం సృష్టిస్తోంది. కోతుల నుంచి వచ్చే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈనెల 3వ తేదీన సాగర్​ తాలుకా అరళగోడ్​లో ఓ వ్యక్తి మరణించటం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

Monkey Fever
మంకీ ఫీవర్ కలకలం

monkey fever in karnataka: కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్​ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి సోకి ఈనెల 3వ తేదీన సాగర్​ తాలుకా అరళగోడ్​కు చెందిన రామస్వామి కరమానే(55) మృతి చెందారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్​లోనూ ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపుర్​ తాలుకాలో మంకీ ఫీవర్​తో 85 ఏళ్ల ఓ మహిళ చనిపోయింది.

మంకీ ఫీవర్​ను క్యాసనుర్​ ఫారెస్ట్​ డిసీస్​(కేఎఫ్​డీ) అని అంటారు. దీనిని 1957లో తొలిసారి శివమొగ్గ జిల్లాలోని క్యాసనుర్​లో గుర్తించారు. ఇది కోతుల నుంచి మనుషులకు వ్యాపింస్తుండటం వల్ల మంకీ ఫీవర్​గా పిలుస్తారు. కోతులకు ఉండే టిక్​-బార్న్​(గోమార్లు) మనుషులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. టిక్స్​ ఎక్కువగా నెమళ్లు, పక్షులు, కుందేళ్లు, కోతుల్లో కనిపిస్తుంటాయి. కోతి చనిపోతే.. వాటికి రక్తం అందదు. అక్కడి నుంచి బయటకు వచ్చి మరో జీవిపైకి చేరతాయి. మనిషిని కరిస్తే జ్వరం, జలుబు వంటి అనారోగ్యాలు వస్తాయి. దానిని నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

మంకీ ఫీవర్​ లక్షణాలు: గోమార్లు కుట్టిన కొన్ని రోజుల్లోనే జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరం, నీరసం, ఆహారం తీసుకోవాలని అనిపించకపోవటం వంటి లక్షణాలు తొలి వారంలో కనిపిస్తాయి. రెండో వారంలో కళ్లు ఎర్రగా మారటం, జ్వరం మరింత పెరగటం, కళ్ల నుంచి రక్తం రావటం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఇతర అవయవాలు సైతం దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

జిల్లాలోని హాట్​స్పాట్లు: శివమొగ్గ జిల్లాలోని సాగర్​, హోసనగర్​, తీర్థనహళ్లి మంకీ ఫీవర్​ హాట్​ స్పాట్లుగా మారాయి. చిన్న జ్వరం వచ్చినా డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు ప్రజలు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేసి నిర్ధరిస్తున్నారు వైద్యులు. పాజిటివ్​ వచ్చిన వారికి మందులు రాసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శివమొగ్గలోని మేఘన్​ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా ప్రభావితమైన వారిని మనిపాల్​ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

జిల్లాలోని అరళగోడ్​ గ్రామంలో 23 మంది మంకీ ఫీవర్​తో చనిపోయిన తర్వాత 2019లో బయో సేఫ్టీ-3 ల్యాబ్​ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్​లో ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఇప్పటి వరకు ల్యాబ్​ కోసం స్థలం కేటాయించకపోవటం గమనార్హం. సాగర్​లో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హరతలు హలప్ప ఇటీవల చేప్పారు. అయితే, ఈ పరిశోధన కేంద్రాన్ని శివమొగ్గలో ఏర్పాటు చేయాలని పలువురు వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.

2022, జనవరి-ఏప్రిల్​ పాజిటివ్​ కేసులు: 2022లో మంకీ ఫీవర్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జనవరి నుంచి ఏప్రిల్​ మధ్యలో మొత్తం 42 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అందులో తీర్థనహళ్లి-29, సాగర్​-04, సిద్ధాపుర్​-09 పాజిటివ్​ కేసులు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి: మంకీ ఫీవర్ కలకలం- అక్కడ తొలి కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.