ETV Bharat / bharat

సత్తా చాటిన 'INS Arihant​'.. బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్​

author img

By

Published : Oct 15, 2022, 6:48 AM IST

భారత్‌.. రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ తన ఆయుధ ప్రయోగ సామర్థ్యాన్ని చాటింది. మొట్టమొదటిసారిగా ఒక బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

missile-test-fired-from-n-powered-ins-arihant
missile-test-fired-from-n-powered-ins-arihant

INS Arihant Missile: రక్షణ రంగంలో భారత్‌ మరో కీలక మైలురాయిని అధిగమించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ శుక్రవారం తన ఆయుధ ప్రయోగ సామర్థ్యాన్ని చాటింది. మొట్టమొదటిసారిగా ఒక బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది అత్యంత కచ్చితత్వంతో బంగాళాఖాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని తాకింది. ఈ ప్రయోగంలో క్షిపణికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించామని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అణుశక్తితో నడిచే బాలిస్టిక్‌ క్షిపణి జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌) కార్యక్రమం కింద ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ను భారత్‌ అభివృద్ధి చేసింది. అత్యంత గోప్యంగా విశాఖపట్నంలో దీని నిర్మాణం సాగింది. అదే శ్రేణిలో రెండో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘత్‌ కూడా సిద్ధమైంది. తాజా పరీక్షతో ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌.. అన్ని విధాలుగా పోరాటానికి సిద్ధమైనట్లు స్పష్టమైంది. మొదట అణుదాడికి పూనుకోకూడదన్నది మనదేశ విధానం. అందువల్ల అటువంటి దాడిని తట్టుకొని.. ప్రతీకార చర్యలకు దిగగలమన్న సత్తాను చాటడం కీలకం. నీటి అడుగున సంచరించే జలాంతర్గాములను పసిగట్టడం చాలా కష్టం. వాటిలో ఉండే అణ్వస్త్ర క్షిపణులతో భారత్‌ ప్రతిదాడికి దిగే అవకాశం ఉందన్న ఆందోళనే.. శత్రువును నిలువరిస్తుంది. తాజా ప్రయోగంతో మన దేశం ఈ సామర్థ్యాన్ని చాటినట్లయింది.

  • జలాంతర్గాముల నుంచి ప్రయోగించే వీలున్న రెండు రకాల క్షిపణులను భారత్‌ అభివృద్ధి చేసింది. అందులో కె-15కు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. కె-4 అనే అస్త్రం.. 3,500 కిలోమీటర్ల దూరం పయనించగలదు. చైనాను దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధి చేశారు.
  • బాలిస్టిక్‌ క్షిపణులతో కూడిన అణు జలాంతర్గాములు కలిగిన ఆరో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనాలకు ఈ సామర్థ్యం ఉంది.
  • అరిహంత్‌.. 2016లో నౌకాదళంలో చేరింది. 83 మెగావాట్ల ప్రెజరైజ్డ్‌ లైట్‌వాటర్‌ రియాక్టర్‌తో ఈ జలాంతర్గామి ముందుకు సాగుతుంది. ఈ రియాక్టర్‌ను భాభా అణు పరిశోధన కేంద్రం నిర్మించింది.

ఇవీ చదవండి: 'నేను బతికున్నంత వరకు భాజపాతో పొత్తు పెట్టుకోను'

'ప్రధానికి మరింత సమయం దొరికింది'.. గుజరాత్ ఎన్నికలపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.