ETV Bharat / bharat

'ఉరే సరి'.. చిన్నారిని రేప్ చేసి, చంపిన వ్యక్తికి క్షమాభిక్ష నిరాకరణ

author img

By

Published : May 4, 2023, 4:51 PM IST

Updated : May 4, 2023, 5:01 PM IST

mercy petition rejected by president of india
mercy petition rejected by president of india

హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడ్డ ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాష్ట్రపతి నిరాకరించారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి, రాళ్లతో కొట్టి చంపిన కేసులో ద్రౌపదీ ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నారు.

నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి, అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిరాకరించారు. ఉరిశిక్ష నుంచి తప్పించాలంటూ అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్​ను తోసిపుచ్చారు. కేంద్ర హోంశాఖ ద్వారా మార్చి 28న అందిన పిటిషన్​పై ద్రౌపదీ ముర్ము ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి అధికార వర్గాలు వెల్లడించాయి.

పక్కింటి చిన్నారిపై కిరాతకంగా..
ఉరిశిక్షను తప్పించుకునేందుకు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్​ పెట్టుకున్న వ్యక్తి పేరు వసంత సంపత్ దుపారే. మహారాష్ట్ర వాసి. ఇప్పుడు వయసు దాదాపు 61 సంవత్సరాలు. 2008లో వసంత సంపత్​ నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా రేప్​ చేసి, రాళ్లతో బలంగా కొట్టి చంపాడు. అదే ఏడాది ట్రయల్ కోర్టు సంపత్​కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాంబే హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. ఉరిశిక్షను సవాలు చేస్తూ వసంత సంపత్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే.. అక్కడా అతడికి నిరాశే ఎదురైంది. దిగువ కోర్టుల తీర్పుల్ని సుప్రీంకోర్టు 2014 నవంబర్​ 26న సమర్థించింది.

అయితే.. వసంత సంపత్​ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దిగువ న్యాయస్థానాల్లో తన వాదనను వినిపించేందుకు సరైన అవకాశం కల్పించలేదని నివేదించాడు. సంపత్​ పిటిషన్​పై విచారించేందుకు 2016 జులై 14న సుప్రీంకోర్టు అంగీకరించింది. వాదోపవాదనల అనంతరం.. సంపత్ రివ్యూ పిటిషన్​ను 2017 మే 3న సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉరే సరైన శిక్ష అని తేల్చిచెప్పింది. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "చిన్నారి గౌరవమర్యాదల్ని చీకట్లో రాక్షసంగా ఖననం చేశాడు" అని ఆవేదన వ్యక్తం చేసింది. సంపత్.. పొరుగు ఇంట్లో ఉండే బాలికకు మాయ మాటలు చెప్పి, రేప్ చేసి, రెండు పెద్ద రాళ్లతో కొట్టి చంపిన విషయాన్ని గుర్తు చేసింది. ఇంతటి కిరాతకం ముందు ఏ వాదన కూడా నిలవదని అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టులోనూ ప్రతికూల తీర్పు వచ్చిన నేపథ్యంలో సంపత్ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. ఉరిశిక్ష నుంచి తప్పించాలని అభ్యర్థించాడు. అందుకు ద్రౌపదీ ముర్ము నిరాకరించారు. ఏప్రిల్​ 10నే ఆమె ఈ నిర్ణయం తీసుకోగా.. సంబంధిత విభాగాలకు రాష్ట్రపతి కార్యాలయం ఇటీవల తెలియజేసింది.

రాజోనా ఉరిశిక్షను మార్చం: సుప్రీం
ఉరిశిక్ష పడ్డ ఖైదీకి శిక్ష తగ్గించడానికి ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించింది. 1995లో అప్పటి పంజాబ్ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలిన బల్వంత్ సింగ్ రాజోనాకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో కేంద్రం వివరణ అవసరమని పేర్కొంది.

Last Updated :May 4, 2023, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.