ETV Bharat / bharat

ఆ లెటర్​ వల్ల యువ మేయర్ 'ఆర్య'కు చిక్కులు.. రాజీనామాకు శశిథరూర్ డిమాండ్

author img

By

Published : Nov 7, 2022, 5:15 PM IST

mayor-arya-rajendran
mayor-arya-rajendran

తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ చిక్కుల్లోపడ్డారు. కార్పొరేషన్​లో ఖాళీల భర్తీకి పార్టీ నేతల పేర్లను సిఫార్సు చేయాలంటూ ఆమె లేఖ రాశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

దేశంలోనే అత్యంత పిన్న వయసులో మేయర్ పీఠాన్ని అధిరోహించిన ఆర్య రాజేంద్రన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తిరువనంతపురం మేయర్​గా ఉన్న ఆర్య.. కార్పొరేషన్​లో తాత్కాలిక పోస్టుల భర్తీ కోసం తమ పార్టీ నేతల పేర్లను సిఫార్సు చేయాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శికి ఆమె లేఖ రాశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దీనిపై భాజపా, వామపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆర్య లేఖకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం భాజపా కౌన్సిలర్లు మేయర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. భాజపా కౌన్సిలర్లను అదుపు చేశారు. అయినా వెనక్కి తగ్గని భాజపా నేతలు.. మేయర్ భవనం తలుపులు మూసేసి.. సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సలీమ్​ను కార్యాలయంలో బంధించారు. ఈ క్రమంలోనే ఎల్​డీఎఫ్ కౌన్సిలర్లు సైతం ఆందోళనకు దిగారు. భాజపా నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

mayor-arya-rajendran-letter-issue
నినాదాలు చేస్తున్న భాజపా కౌన్సిలర్లు
mayor-arya-rajendran-letter-issue
వామపక్షాల కౌన్సిలర్లతో వాగ్వాదం

'రాజీనామా చేయాలి'
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్.. ఆర్య రాజేంద్రన్​పై విమర్శలు ఎక్కుపెట్టారు. 'ప్రభుత్వ పోస్టులను పార్టీ కార్యకర్తలతో భర్తీ చేసేందుకు ఆర్య రాజేంద్రన్ ప్రయత్నించడం దారుణం. కేరళతో పాటు దేశంలోని యువత నిరుద్యోగంతో బాధపడుతున్న సమయంలో ఇలా చేయడం ద్రోహం. ఆమె తన పదవికి రాజీనామా చేయాలి' అని ట్వీట్ చేశారు.

ఆర్య స్పందన ఇదే..
మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని హెల్త్ డిపార్ట్​మెంట్​లో ఖాళీగా ఉన్న 295 తాత్కాలిక పోస్టుల భర్తీకి ఆర్య రాజేంద్రన్.. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆనవూర్ నాగప్పన్​కు లేఖ రాశారని విపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ పోస్టుల కోసం ప్రాధాన్య జాబితా పంపించాలని నాగప్పన్​ను ఆర్య కోరారని చెబుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను మేయర్ ఖండించారు. ఆ లేఖ నకిలీది అని, రాజకీయంగా దుష్ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ భాజపా కౌన్సిలర్లు చేస్తున్న ప్రయత్నమే ఇది అని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.