ETV Bharat / bharat

Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయసు.. 21ఏళ్లకు పెంపు!

author img

By

Published : Dec 16, 2021, 11:00 AM IST

Updated : Dec 16, 2021, 2:32 PM IST

Marriage age for female: అమ్మాయిల వివాహ వయసు పెంపునకు మరో అడుగు పడినట్లు సమాచారం. కనీస వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21కి పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా తొలగించాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Marriage Age
అమ్మాయిల కనీస వివాహ వయసు

Marriage age for female: అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిలకు 18ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ప్రస్తుతం ఉండగా.. దానిని 21ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21ఏళ్లు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే, గత కొంతకాలంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటం.. వారి కెరీర్‌కు అవరోధంగా మారుతోందనే వాదనలు ఉన్నాయి. అంతేగాక, దీని వల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు.

ఈ అభ్యర్థనలను పరిగణించిన కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఉందని గతేడాది స్వాత్రంత్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం గతేడాది జూన్‌లోనే నీతి ఆయోగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి జయ జైట్లీ నేతృత్వం వహించగా.. ప్రభుత్వ నిపుణులు డాక్టర్‌ వీకే పాల్‌, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు.

ఈ టాస్క్‌ఫోర్స్‌ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. వాటన్నింటినీ పరిశీలించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. అమ్మాయిలు తొలి సారి గర్భం దాల్చేనాటికి వారి వయసు కనీసం 21ఏళ్లు ఉండాలని సూచించింది. అంతేగాక, అమ్మాయిలకు 21ఏళ్లకు వివాహం చేయడం అది ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో సవరణలు తీసుకురావాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్​కు బిల్​

అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచేందుకు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 సవరణ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఒకే విధమైన వివాహ వయసు ఉండేందుకు వివిధ సమాజాల్లోని వివాహాలకు సంబంధించిన చట్టాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపాయి.

ఇదీ చూడండి:

'మహిళల వివాహ వయసు పెంచితే కీడే ఎక్కువ'

మహిళల వివాహ వయసు పెంపునకు మరో అడుగు

ముందు కెరీర్​.. తర్వాతే పెళ్లంటున్న అమ్మాయిలు

Last Updated :Dec 16, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.