ETV Bharat / bharat

అంబానీ ఇంటి వద్ద బాంబులు- ఆ అధికారి పాత్ర ఉందా?

author img

By

Published : Mar 9, 2021, 7:47 PM IST

Mansukh Hiran death: Fadnavis seeks arrest of cop Sachin Vaze
అంబానీ ఇంటి వద్ద బాంబులు- ఆ అధికారి పాత్ర ఉందా?

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద బాంబులు దొరికిన ఘటనకు చెందిన కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్థాలు ఉన్న వాహనం యజమాని మరణంతో... కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​.. అసెంబ్లీ సమావేశాల వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసు అధికారి సచిన్​ వేజ్​ను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పేలుడు పదార్థాలు ఉన్న వాహనానికి సంబంధించిన యజమాని హిరేన్​ మన్​సుఖ్​.. కొద్ది రోజుల క్రితం మరణించడం, ఆయనది హత్యేనని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​) చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి సచిన్​ వేజ్​పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిరేన్​ హత్యలో సచిన్​ పాత్ర ఉందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

'సచిన్​ను అరెస్ట్​ చేయాలి'

హిరేన్​ మన్​సుఖ్​ హత్యతో సచిన్​ వేజ్​కు సంబంధం ఉందని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ ఆరోపించారు. సచిన్​ను వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా డిమాండ్​ చేశారు.

ఫడణవీస్ వ్యాఖ్యలు.. అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీశాయి. సభ అనేకమార్లు వాయిదా పడింది. ఈ పూర్తి వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి స్పందించేంత వరకు సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించమని ఫడణవీస్​ తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో హిరేన్​ భార్య దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ను ప్రస్తావించారు ఫడణవీస్​. తన భర్తది హత్యేనని.. అందులో సచిన్​ హస్తం ఉందని ఆమె ఆరోపించినట్టు భాజపా నేత పేర్కొన్నారు.

"తన భార్తకు సచిన్​ వేజ్​ తెలుసని ఎఫ్​ఐఆర్​లో హిరేన్​ భార్య వెల్లడించారు. 2020 నవంబర్​ నుంచి గత నెల 5 వరకు.. ఆ స్కార్పియో(పెలుడు పదార్థాలు ఉన్న వాహనం) సచిన్​ వద్దే ఉందని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 27, 28, మార్చి 2వ తేదీల్లో హిరేన్​.. సచిన్​ను కలిసినట్టు ఆమె తెలిపారు. ముందు లొంగిపోవాలని.. కొన్ని రోజుల తర్వాత బెయిల్​ మీద బయటకు తీసుకొస్తానని.. సచిన్​ తన భర్తకు చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. కొన్ని పరిణామాల తర్వాత... హిరేన్​ మృతదేహం కనిపించింది. ఆయన్ను ఎవరో చంపి.. సముద్ర పాయలో పడేసి ఉండవచ్చు. ఈ ప్రభుత్వం సచిన్​ వేజ్​ను రక్షించే ప్రయత్నం చేస్తోంది."

--- దేవేంద్ర ఫడణవీస్​, భాజపా నేత.

'అప్పుడే మాట్లాడతా..'

తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా సమీక్షించిన అనంతరం తాను స్పందిస్తానని అన్నారు సచిన్​ వేజ్.

దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం అదృశ్యమైన ఆయన శుక్రవారం సముద్రపు పాయలో శవమై కనిపించారు.

పీపీఈ కిట్​లో నిందితుడు!

ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా.. స్కార్పియో నుంచి బయటకు వస్తున్న ఓ వ్యక్తి ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. అతడు పీపీఈ కిట్​ ధరించి ఉన్నాడు. పోలీసులు అతడిని ఇంకా గుర్తించలేదు.

ఇదీ చూడండి:- 'అంబానీ ఇంటి వద్ద ఆ కారును పార్క్​ చేసింది మేమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.