ETV Bharat / bharat

'వారిని ఆదుకోండి'.. మణిపుర్ హింసపై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

author img

By

Published : May 8, 2023, 4:24 PM IST

Updated : May 8, 2023, 4:48 PM IST

Manipur violence : మణిపుర్​లో చెలరేగిన హింసతో నిరాశ్రయులుగా మారినవారికి సహాయం చేయాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పునరావాస శిబిరాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. పరిస్థితులను అదుపు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో.. పది రోజుల్లోగా చెప్పాలని ఆదేశించింది.

manipur violence supreme court
manipur violence supreme court

Manipur violence : మణిపుర్​ హింసాత్మక ఘటనల బాధితుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహాయక శిబిరాల్లో ఆహారం, వైద్య సదుపాయాలు సహా అన్ని రకాల కనీస ఏర్పాట్లు చేయాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాలను ఆదేశించింది. హింస తలెత్తిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను మానవతా సమస్యలుగా పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. ఆశ్రయం కోల్పోయిన వారి పునరావాసం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాలను సంరక్షించడంపై దృష్టిసారించాలని ఆదేశించింది. హింస అదుపులోకి వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టింది. మణిపుర్​లో పరిస్థితులను అదుపు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రం, మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పది రోజుల్లో దీనిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీజేఐ సహా జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన బెంచ్.. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది.

గడిచిన రెండు రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. హింసను నియంత్రించేందుకు చేపట్టిన చర్యల గురించి కోర్టుకు వివరించాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను కొన్ని గంటల పాటు సడలించినట్లు వెల్లడించాయి. "52 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, 105 కాలమ్​ల ఆర్మీ/ అసోం రైఫిల్ బృందాలను మణిపుర్​లో మోహరించాం. కల్లోలిత ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్​లు నిర్వహించాం. సీనియర్ పోలీస్ అధికారిని సెక్యూరిటీ అడ్వైజర్​గా నియమించాం. కేంద్రం నుంచి వచ్చిన సీనియర్ అధికారిని చీఫ్ సెక్రెటరీగా నియమించాం. వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని భద్రతా దళాల సాయంతో తరలిస్తున్నాం" అని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టుకు వివరించారు.

సరిహద్దుపై నిఘా..
హింసను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచినట్లు సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. మానవరహిత విమానాలు, హెలికాప్టర్లతో పహారా కాస్తున్నట్లు చెప్పారు. కల్లోలిత పరిస్థితులను ఉపయోగించుకొని వేర్పాటువాదులు చెలరేగకుండా చూసేందుకు.. మయన్మార్ సరిహద్దుపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు స్పష్టం చేశారు.
మరోవైపు, ఇంఫాల్ సహా పలు ప్రాంతాల్లో మూడు గంటల పాటు కర్ఫ్యూను ఎత్తివేసినట్లు మణిపుర్ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ హెయిస్నామ్ బాలకృష్ణన్ ఈటీవీ భారత్​కు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు, ప్రజలను విమానాల్లో తరలించినట్లు చెప్పారు.

మణిపుర్​లో ఏమైంది?
మణిపుర్​లో గిరిజన, గిరిజనేతరుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 23 వేల మందికి పైగా ఆశ్రయం కోల్పోయారు. సైన్యం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో వీరంతా ఆశ్రయం పొందుతున్నారు. మణిపుర్ కొండల్లో ఉండే గిరిజనులకు, ఇంఫాల్ లోయలో ఉండే మైతే వర్గాలకు మధ్య ఈ ఘర్షణలు తలెత్తాయి.

Last Updated :May 8, 2023, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.