ETV Bharat / bharat

రెచ్చిపోయిన మహిళా సాయుధ తిరుగుబాటుదారులు.. మణిపుర్​లో​ ఇళ్లు, స్కూల్​కు నిప్పు

author img

By

Published : Jul 24, 2023, 4:25 PM IST

Manipur Issue : మణిపుర్​లో​ పది ఇళ్లతో పాటు ఓ పాఠశాలకు నిప్పుపెట్టారు మహిళా సాయుధ తిరుగుబాటుదారులు. వందల మందితో కూడిన ఈ గుంపు.. బీఎస్​ఎఫ్​ వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లాయి. శనివారం ఈ ఘటన జరిగింది. మరోవైపు మణిపుర్​ మహిళలపై దారుణాలకు వ్యతిరేకంగా గుజరాత్​లోని ఓ జిల్లా ప్రజలు బంద్ పాటించారు.

Manipur Violence Houses and school set on fire in Manipur by hundreds of women mob
మణిపుర్​లో​ పది ఇళ్లు, స్కూల్​కు నిప్పు

Manipur Violence : మణిపుర్​లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వందల మందితో కూడిన మహిళా సాయుధ తిరుగుబాటుదారులు పది ఇళ్లకు నిప్పుపెట్టారు. ఓ స్కూల్​కు సైతం నిప్పంటించారు. ఒక బీఎస్​ఎఫ్​ వాహనాన్ని సైతం మహిళల గుంపు ఎత్తుకెళ్లింది. ఆ సమయంలో ఇళ్లలో, పాఠశాలల్లో ఎవ్వరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

చురాచాంద్‌పుర్ జిల్లాలోని టోర్బంగ్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం వారు వెల్లడించారు. ఘటనకు ముందు మహిళా సాయుధ తిరుగుబాటుదారులు.. గాల్లో చాలా రౌండ్లు కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. "వందల మంది కూడిన సాయుధ తిరుగుబాటు మహిళలు మా వైపు వచ్చారు. దీంతో మేము చాలా భయపడిపోయాం. వాళ్లు ఓ బీఎస్​ఫ్​ వాహనాన్ని తీసుకెళ్లారు. అనంతరం మా ఇళ్లకు నిప్పుపెట్టారు" అని స్థానికులు తెలిపారు. తరువాత వారు మరో బీఎస్ఎఫ్​ వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని.. కానీ బలగాలు వారిని నిరోధించాయని తెలిపారు.

గుజరాత్​లో బంద్​..
కాగా మణిపుర్​లో గిరిజన మహిళలపై దారుణాలకు వ్యతిరేకంగా.. ఆదివారం గుజరాత్​లోని ఛోటాడేపుర్​ జిల్లాలో బంద్​కు పిలుపునిచ్చాయి అక్కడి గిరిజన సంఘాలు. దీంతో జిల్లాలోని చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొన్నారు. కొంత మంది గిరిజన నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్​, ఆప్ నేతలు కూడా బంద్​లో పాల్గొన్నారు.

గత కొద్ది రోజులుగా జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్ అట్టుడుకుతోంది. మే 3న రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఆ తర్వాతి రోజు జరిగిన అమానుష ఘటనకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తూ కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళలపైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు సైతం వచ్చాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా మణిపుర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు వంద మందికి పైగా పౌరులు మృతిచెందారు. 50 వేల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.