ETV Bharat / bharat

'కొన్ని' శిబిరంలో 'మణికందన్​' సందడి

author img

By

Published : Apr 30, 2021, 8:06 PM IST

కేరళలోని 'కొన్ని' నగరంలోని గజరాజుల శిబిరంలో 'మణికందన్​' అనే ఓ గున్న ఏనుగు సందడి చేస్తోంది. తన చిలిపిచేష్టలతో అందరినీ అలరిస్తోంది. గత నెలలో ఓ ఊరిలో కనిపించిన ఈ ఏనుగు పిల్లను 'కొన్ని' శిబిరానికి అటవీ శాఖ అధికారులు తరలించారు.

elephant calf
'కొన్ని' క్యాంపులో గున్న ఏనుగు

'కొన్ని' క్యాంపులో గున్న ఏనుగు

అది 2021 మార్చి 13... కేరళ మలప్పురం జిల్లా వాజిక్కడవులోని మైదానంలో చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. అంతలో ఓ రెండున్నర నెలల వయసు ఉన్న ఓ గున్న ఏనుగు వారి మధ్యకు వచ్చింది. దాంతో పిల్లలంతా ఇళ్లకు పరుగందుకున్నారు. ఈ ఏనుగు విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ గున్న ఏనుగు తన మంద నుంచి విడిపోయి.. ఇలా జనావాసాల్లోకి వచ్చిందని తెలుసుకున్న వారు.. తిరిగి దాని తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నించారు.

తల్లి రాలేదు..

చుట్టుపక్కల ఏనుగులు సంచరించే వివిధ ప్రాంతాల్లోకి ఆ గున్న ఏనుగును అటవీ సిబ్బంది తీసుకువెళ్లారు. కానీ, దాని వద్దకు తల్లి ఏనుగు రాలేదు. దాంతో.. కొన్ని నగరంలోని ఏనుగు శిక్షణా కేంద్రానికి ఈ పిల్ల ఏనుగును తరలించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ గున్న ఏనుగుకు వాజిక్కడవు ప్రజలే 'మణికందన్'​ అని పేరు పెట్టారు. మావటీలు.. మణికందన్​కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతున్నారు. ఆకలేసినప్పుడు పాల కోసం తన చిన్ని తొండాన్ని చాచి అడుగుతోందని వారు చెబుతున్నారు.

అలరిస్తున్న మణికందన్..

మణికందన్​ను చూసేందుకు కొన్ని శిక్షణా కేంద్రానికి చాలా మంది తరలివస్తున్నారు. తన బుజ్జిబుజ్జి నడకలతో, చేష్టలతో అందరినీ అది అలరిస్తోంది. అంతకుముందు ఇక్కడ 'పింజు' అనే గున్న ఏనుగు ఉండేది. కానీ, కొన్నాళ్ల క్రితం అది జబ్బు చేసి చనిపోయింది. మణికందన్​ వచ్చే వరకు కొన్ని శిబిరంలో గున్న ఏనుగులు ఉండేవి కావని అక్కడి అధికారులు చెప్పారు. కొన్ని ఏనుగు శిబిరంలో అటవీ అధికారులతో పాటు వైద్య సిబ్బంది నిరంతం అందుబాటులో ఉంటూ.. మణికందన్​ను సంరక్షిస్తున్నారని పశువైద్యుడు డాక్టర్​ అరుణ్​ సత్యన్​ తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా వల్ల 22 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు..

ఇదీ చూడండి: నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.