ETV Bharat / bharat

పాము తల కొరికి వెకిలి చేష్టలు.. సోషల్ మీడియాలో వ్యూస్​ కోసం దారుణం.. ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Apr 6, 2023, 2:08 PM IST

Updated : Apr 6, 2023, 2:26 PM IST

సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసే వీడియోలకు ఎక్కువ వ్యూస్​ రావాలని దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అందుకోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వ్యూస్​ను పెంచుకునేందుకు పాము పట్ల దారుణంగా ప్రవర్తించారు. అందులో ఓ వ్యక్తి పాము తలను కొరికి చంపాడు. మిగతా ఇద్దరు అతడికి సహకరించారు.

man bites snake head off
man bites snake head off

సామాజిక మాధ్యమాల్లో ఫేమస్​ అవ్వాలని చాలా మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్​ కోసం మూగజీవాలనూ వదలట్లేదు. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి పామును హింసించి.. చంపారు. ఆ వీడియోను తీసి ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

తమిళనాడు అరక్కోణంకు చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి.. బతికున్న పామును పట్టుకున్నారు. అనంతరం మోహన్​ అనే వ్యక్తి చేతిపై పాము కాటు వేసింది. దీంతో మోహన్ దాని తల భాగాన్ని కొరికాడు. కాటు వేసిన పాముపై ప్రతీకారం తీర్చుకోవాలని వీడియోలో చెప్పాడు. ఆ యువకుడికి మరో ఇద్దరు అండగా నిలిచారు. పాము తలను మోహన్ కొరుకుతున్నప్పుడు వారంతా నవ్వులు చిందించారు.

పామును హింసించి.. దాని తల కొరుకుతున్న దృశ్యాలను సెల్​ఫోన్ కెమెరాతో చిత్రీకరించారు. అనంతరం ఫేస్​బుక్​లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో పామును హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియో పర్యావరణ కార్యకర్తల దృష్టికి చేరింది. వారు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మోహన్, సూర్య, సంతోశ్ అనే ముగ్గురు నిందితులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను వేధించడం, పాము మరణానికి కారణమైనందుకు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు.

పామును కరిచి చంపిన మనిషి..
రెండేళ్ల క్రితం.. గుజరాత్​లో ఓ మనిషి కరవడం వల్ల పాము మృతి చెందింది. అజాన్వ గ్రామానికి చెందిన పర్వత్​ గాల బరియా అనే వ్యక్తిని పాము కాటేసింది. ఆగ్రహంతో పర్వత్​ పామును కరిచాడు. ఈ ఘటనలో పర్వత్​తో పాటు పాము కూడా మృతి చెందింది.​ ఈ విషయాన్ని గ్రామ సర్పంచి వివరించారు.

"పొలంలో మొక్కజొన్నను లారీలోకి ఎక్కిస్తోన్న సమయంలో ఓ పాము బుసలు కొడుతూ అటువైపు వచ్చింది. అందరం పరిగెత్తాం. కానీ పర్వత్​ అక్కడే ఉండిపోయాడు. పాములను పట్టుకోవడం తనకు అలవాటే అని అన్నాడు. ఆ సర్పం పర్వత్​ ముఖంపై, చేతిపై కాటేసింది. పర్వత్​ కూడా పామును కరిచాడు."

- కను బరియా, సర్పంచ్​

నాకే అడ్డు వస్తావా?..
గతేడాది కర్ణాటకలోని కోలారు జిల్లా ముష్టూరు గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పామునే కొరికి చంపాడు. మోటార్‌ సైకిల్‌ను నడుపుకొంటూ వెళ్తుండగా ఓ పాము అడ్డం వచ్చింది. నాకే అడ్డు వస్తావా? అంటూ మోటార్‌ సైకిల్​ను ఆపి పామును పట్టుకుని అక్కడికక్కడే దాని తల భాగాన్ని కొరికి చంపాడు. ఆ తరువాత దాన్ని మెడలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Last Updated : Apr 6, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.