సుప్రీం తీర్పుపై మాటల యుద్ధం.. రాజీనామాకు ఠాక్రే డిమాండ్.. ఫడణవీస్ చురకలు

author img

By

Published : May 11, 2023, 4:56 PM IST

maharashtra political crisis
maharashtra political crisis ()

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేను తిరిగి నియమించలేమన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్. నైతికత గురించి మాట్లాడే అర్హత ఉద్ధవ్​ ఠాక్రేకు లేదన్నారు. సీఎం పదవి కోసం ఎన్​సీపీ, కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్నప్పుడు నైతికత గురించి ఉద్ధవ్​కు గుర్తు రాలేదా? అని విమర్శించారు. మరోవైపు.. నైతికత ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ రాజీనామా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా ఆయన అభివర్ణించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తాము సంతృప్తి చెందామని తెలిపారు. 'మా ప్రభుత్వం కూలిపోతుందని ఊహాగానాలు చేసిన వారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో మౌనంగా ఉన్నారు. నైతికత గురించి మాట్లాడే అర్హత ఉద్ధవ్ ఠాక్రేకు లేదు. సీఎం పదవి కోసం ఎన్‌సీపీ, కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన నైతికత మరిచిపోయారా? ఆయన నైతికతతో సీఎం పదవికి రాజీనామా చేయలేదు. గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మహా వికాస్ అఘాడి కుట్ర ఓడిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చట్టబద్ధమైనది. ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదు' అని ఫడణవీస్​ అన్నారు. ముంబయిలో ఆయన.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

'అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించారు'..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్ భగత్​ సింగ్ కోశ్యారీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు గురించి తాను మాట్లాడనని తెలిపారు. 'సంక్షోభ సమయంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్​ పరిస్థితులను అనుగుణంగా వ్యవహరించారు' అని శిందే అన్నారు.

'శిందే, ఫడణవీస్ రాజీనామా చేయాలి'
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. నైతికత ఉంటే తాను రాజీనామా చేసిన చేసినట్లుగానే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ తీర్పు..
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్​ ఠాక్రే వర్గం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది.

అయితే ఆ సంక్షోభ సమయంలో అప్పటి గవర్నర్ భగత్​ సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. "ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయారని నిర్ధరణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు.. సభలో మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని పిలవడం సబబు కాదు. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేడయంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఠాక్రే రాజీనామా చేయడం వల్ల అప్పటికే అతిపెద్ద పార్టీ అయిన భాజపా మద్దతు ఉన్న ఏక్‌నాథ్‌ శిందే వర్గంతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం సమర్థనీయమే" అని సుప్రీంకోర్టు తెలిపింది.

ఇదీ కేసు..
2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది.. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా శిందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ శిందే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుకు ఆశ్రయించింది. మరోవైపు.. ఫిరాయింపు ఆరోపణలతో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ ప్రకారం తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ శిందే వర్గం కూడా సుప్రీంను ఆశ్రయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.