ETV Bharat / bharat

'దావూద్​' మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు నవాబ్​ మాలిక్​

author img

By

Published : Feb 23, 2022, 12:31 PM IST

Updated : Feb 23, 2022, 12:39 PM IST

Nawab Malik
నవాబ్​ మాలిక్​

Nawab Malik: ముంబయి అండర్‌వరల్డ్‌ వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్‌ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు మహా వికాస్​ అఘాడీ నేతలు.

Nawab Malik: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహిం మనీలాండరింగ్​ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మాలిక్​. ఉదయం 7 గంటలకు విచారణ చేపట్టారు. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహిం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్లు తెలిసింది. దావూద్​ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్​ సోదరుడు ఇబ్రహిం కస్కర్​తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రహిం కస్కర్​ను అరెస్ట్​ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్​ మాలిక్​కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతకాలం క్రితం ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది ఈడీ. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్​ లావాదేవీల పత్రాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్​ను ప్రశ్నించిటనట్లు పేర్కొన్నారు.

నవాబ్​ మాలిక్​ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు అధికారులు.

కేంద్రంపై విమర్శలు..

నవాబ్‌ మాలిక్‌ను ఈడీ విచారించడంపై మహాష్ట్రలోని అధికార మహావికాస్‌ అఘాడీ కూటమి నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నవాబ్‌ మాలిక్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆక్షేపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఒక మంత్రిని విచారణకు తీసుకెళ్లిన తీరు మహారాష్ట్ర సర్కారుకు సవాల్‌ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. 2024 తర్వాత ఈడీ అధికారులంతా విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

" మహా వికాస్​ అఘాడీ, నవాబ్​ మాలిక్​లకు ఈడీ నోటీసులు పంపిస్తుందని చాలా రోజులుగా భాజపా నేతలు చెబుతున్నారు. కానీ, ఎలాంటి నోటీసులు లేకుండానే ఆయన్ని నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. వారు ప్రారంభించిన ఈ కొత్త రాజకీయల గురించి తెలియటం లేదు. ఇది మహారాష్ట్రను అవమానించటమే."

- ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే.

గత కొన్ని రోజులుగా భాజపా నేతల గురించి మాట్లాడినందుకు మాలిక్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. మహారాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్ ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి: తల్లిని చంపిన 14ఏళ్ల బాలిక.. కారణం ఏంటి?

Last Updated :Feb 23, 2022, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.