ETV Bharat / bharat

మామ కౌన్సిల్​ ఛైర్మన్.. అల్లుడు అసెంబ్లీ స్పీకర్​.. దేశంలోనే యంగెస్ట్ సభాపతి!

author img

By

Published : Jul 3, 2022, 11:13 AM IST

Updated : Jul 3, 2022, 3:21 PM IST

Maharastra Politics: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బలనిరూపణకు వీలుగా ఆదివారం స్పీకర్​ ఎన్నిక జరిగింది. ఏక్​నాథ్​ బృందం మద్దతుతో భాజపా నేత రాహుల్​ నర్వేకర్​ స్పీకర్​గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కౌన్సిల్ ఛైర్మన్​గా ఉన్న రామ్​రాజేనాయక్ అల్లుడే రాహుల్​ నర్వేకర్​. మరోవైపు, విధాన్​భవన్​లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్​ చేశారు శివసేన నేతలు.

maha-cm-shinde-led-sena-faction-seals-legislative-party-office-in-vidhan-bhavan
maha-cm-shinde-led-sena-faction-seals-legislative-party-office-in-vidhan-bhavan

Maharastra Assembly Speaker: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరింది. కొత్త సీఎం ఏక్​నాథ్ శిందే సర్కారు బలనిరూపణకు వీలుగా ఆదివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం భాజపా తరపున రాహుల్‌ నర్వేకర్‌.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్‌ సాల్వీ పోటీపడ్డారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే.. భాజపాతో చేతులు కలిపిన నేపథ్యంలో రాహుల్‌ నర్వేకర్‌ స్పీకర్​ పదవికి ఎన్నికయ్యారు. రాహుల్ నర్వేకర్​కు అనుకూలంగా 164 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 107 ఓట్లు పడ్డాయి. స్పష్టమైన మెజార్టీ సాధించడం వల్ల స్పీకర్​గా రాహుల్ ఎన్నికైనట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అనంతరం రాహుల్​ నర్వేకర్​కు సీఎం ఏక్​నాథ్​ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​ అభినందనలు తెలిపారు.

దేశంలోనే అతిపిన్న వయసు గల స్పీకర్.. మహారాష్ట్ర అసెంబ్లీకి నూతన స్పీకర్​గా ఎన్నికైన రాహుల్​ నర్వేకర్.. దేశంలోనే అతి పిన్నవయసు గల అసెంబ్లీ స్పీకర్​ అని ఉపముఖ్యమంత్రి ఫడణవీస్​ తెలిపారు. అంతేకాకుండా ఎన్సీపీ నాయకుడు, ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్​ రామ్​రాజేనాయక్​ నింబాలాకర్​ అల్లుడే రాహుల్​ నర్వేకర్​ అని గుర్తుచేశారు.

SHINDE-SENA OFFICE
స్పీకర్​కు పుష్పగుచ్ఛం ఇస్తున్న శిందే, ఫడణవీస్​

శివసేన కార్యాలయానికి సీల్​.. ముఖ్యమంత్రి శిందే నేతృత్వంలోని శివసేన నేతలు.. విధాన్​భవన్​లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్​ చేశారు. దాంతో పాటు కార్యాలయం తలుపు మీద నోటీసు అంటించారు. శివసేన శాసనసభాపక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నాం అని దానిపై మరాఠీలో రాసి ఉంది. మరోవైపు, సోమవారం మహా సీఎం శిందే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబయి చేరుకున్నారు. వీరంతా శిందేకు మద్దతుగా నిలుస్తారా? అనేది ఓటింగ్‌లో తేలనుంది.

శివసేన కార్యాలయం
శివసేన కార్యాలయం

తెరపైకి ఆరే మెట్రో కార్​ షెడ్​ వివాదం..
మెట్రో కార్​షెడ్ ప్రాజెక్టును ఆరే కాలనీలోనే నిర్మించాలని సీఎం ఏక్​నాథ్ శిందే తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆందోళనలకు సిద్ధమయ్యారు. 'నగరంలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా, కొన్ని స్థానిక జాతులతో సహా వన్యప్రాణులకు ఆరే కాలనీ ఆవాసంగా ఉంది' అని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. అడవిలో దాదాపు ఐదు లక్షల చెట్లు ఉన్నాయి. వాటితోపాటు రెండు నదులు, సరస్సులు ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఠాక్రే సర్కారు పక్కనబెట్టిన ఈ ప్రాజెక్టును.. ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పట్టాలెక్కించారు శిందే. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని నిర్ణయించారు.

'మాపై కోపాన్ని ప్రజలపై చూపించొద్దు'..
కాగా, ఆరే కాలనీ మెట్రో కార్​ షెడ్​ నిర్మాణానికి సంబంధించిన నిరసన స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే.. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానంటూ ట్వీట్​ చేశారు. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కొత్త సర్కారును కోరారు. తమపై కోపాన్ని ప్రజలపై చూపించొద్దని ఆదిత్య అన్నారు.

అసలేంటీ ప్రాజెక్టు వివాదం..
2019లో దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ హయాంలో ఆరే కాలనీలో మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్.. బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) అనుమతి కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లను నరకాల్సి రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పర్యావరణ కార్యకర్తలతో పాటు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత భాజపాతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే 2019 నవంబరులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెట్రో కార్‌ షెడ్‌పై ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్‌షెడ్‌ను ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలించారు. అంతేగాక, ఆరే కాలనీని రిజర్వ్‌ అటవీ ప్రాంతంగా ప్రకటించారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, రాష్ట్రంతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో ఠాక్రే నిర్ణయంపై బాంబే హైకోర్టే స్టే విధించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. తాజాగా భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే.. ఫడణవీస్‌ ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవీ చదవండి: దటీజ్ ఆర్మీ... 4గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం.. అమర్​నాథ్ యాత్రికులకు రిలీఫ్!

భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్.. నగ్న వీడియోలు తీసి..

Last Updated :Jul 3, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.