ETV Bharat / bharat

ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు- తొలిరోజే సీఎం సంచలన నిర్ణయాలు

author img

By PTI

Published : Dec 14, 2023, 8:48 AM IST

Updated : Dec 14, 2023, 9:15 AM IST

Loudspeaker Ban in MP : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నియంత్రణ విధించారు. ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Loudspeaker Ban in MP
Loudspeaker Ban in MP

Loudspeaker Ban in MP : నూతనంగా బాధ్యతలు చేపట్టిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల నియంత్రణకు సంబంధించి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన పరిమితికి మించి లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించారు మోహన్ యాదవ్. ఉపముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్డా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మోహన్ యాదవ్ సంతకం చేసిన తొలి ఉత్తర్వులు లౌడ్ స్పీకర్​ ఆంక్షలకు సంబంధించినవే కావడం విశేషం.

ఫ్లయింగ్ స్క్వాడ్​లతో పర్యవేక్షణ
సుప్రీంకోర్టు ఉత్తర్వులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​ ఆదేశాలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసినట్లు అదనపు చీఫ్ సెక్రెటరీ (హోం) డాక్టర్ రాజేశ్ రాజోరా పేర్కొన్నారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. లౌడ్ స్పీకర్లు, డీజే సిస్టమ్​ల శబ్దాలను మానిటర్ చేయడానికి ప్రతి జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్​లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు, ఆస్తి హక్కుల బదిలీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్ కేబినెట్. సింగిల్ విండో విధానం ద్వారా ఆస్తి హక్కు బదిలీలు జరిగేలా సైబర్ తెహసీల్ స్కీమ్​ను తీసుకొచ్చింది. 2024 జనవరి 1 నుంచి రాష్ట్రంలోని 55 జిల్లాల్లో ఈ విధానం అమలులోకి రానుంది.

డిజీలాకర్​లో మార్క్​షీట్లు- నేరాల నియంత్రణకు చర్యలు
బహిరంగంగా మాంసం, చేపల విక్రయాలు జరగకుండా చూడాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 15-31 మధ్య ఇందుకు సంబంధించి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని ఆదేశించింది. పోలీసులు, స్థానిక సంస్థలు ఇందులో భాగం కావాలని పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న 16 ప్రభుత్వ, 55 ప్రైవేటు విశ్వవిద్యాలయాల విద్యార్థుల మార్క్​షీట్లను డిజీలాకర్​లో అప్​లోడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రయోజనాలను యువతకు పూర్తిగా అందే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. ప్రతి జిల్లాలో కనీసం ఓ ప్రభుత్వ కళాశాలను 'ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్స్​లెన్స్​'గా అప్​గ్రేడ్ చేయాలని సంకల్పించుకున్నట్లు వివరించారు. స్మార్ట్ తరగతి గదులు, సెమినార్ హాళ్లు, హాస్టళ్లు సహా ఇతర అధునాతన వసతులు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మోహన్ యాదవ్ వివరించారు. బెయిల్​పై బయట ఉన్న వ్యక్తి మరో నేరం చేస్తే బెయిల్ రద్దయ్యేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.
మరోవైపు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీడీ ఆకులను సేకరించే వారికి ఇచ్చే బోనస్​ను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

మధ్యప్రదేశ్​ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్​- ఎవరీయన?

వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'

Last Updated :Dec 14, 2023, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.