షాహీన్​బాగ్​కు మళ్లీ బుల్డోజర్లు.. సుప్రీంలో వారికి చుక్కెదురు!

author img

By

Published : May 9, 2022, 12:17 PM IST

Updated : May 9, 2022, 7:15 PM IST

Shaheen Bagh

Shaheen Bagh protests: అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా దిల్లీలోని షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు దర్శనమిచ్చాయి. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై సీపీఎం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వారికి చుక్కెదురైంది.

Shaheen Bagh protests: దిల్లీలోని షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు కనిపించటం ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్​డీఎంసీ అధికారులు బుల్డోజర్​లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. భాజపా పాలిత సౌత్​ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​(ఎస్​డీఎంసీ), కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. అక్రమ కట్టడాల పేరుతో చేపట్టిన కూల్చివేతలను వెంటనే నిలిపేయాలని డిమాండ్​ చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి కూల్చివేతలు లేకుండానే వెనుదిరిగారు ఎస్​డీఎంసీ అధికారులు.

Shaheen Bagh
బుల్డోజర్లను అడ్డుకుంటున్న స్థానికులు

ఈ నిరసనల్లో స్థానికులతో కలిసి ఆప్​ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్​ పాల్గొన్నారు. "నా వినతితో ఇప్పటికే ప్రజలు అక్రమ నిర్మాణాలను తొలగించారు. వాజుఖానా, మూత్రశాలలు గతంలోనే పోలీసుల సమక్షంలోనే తొలగించాం. ఇప్పుడు ఎలాంటివి లేవు. వారు మళ్లీ ఎందుకు వచ్చారు? అది రాజకీయం కాదా?" అని ప్రశ్నించారు.

"అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు మా సిబ్బంది బుల్డోజర్లు, ట్రక్కులతో పాటు పోలీసు బలగాలు షాహీన్​బాగ్​ చేరుకున్నాయి. అక్రమ నిర్మాణాలను తొలగించటం మా బాధ్యత. "

- రాజ్​పాల్​ సింగ్​, ఎస్​డీఎంసీ సెంట్రల్​ జోన్​ ఛైర్మన్​.

ఎస్​డీఎంసీ అధికారులకు భద్రత కల్పించేందుకు సీనియర్​ పోలీసు అధికారులు సైతం షాహీన్​బాగ్​కు వెళ్లారు. "అక్రమ నిర్మణాల తొలగింపు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించాం. ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు పని చేయటం సహా వారి భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని సీనియర్​ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

రాజకీయ పార్టీలు కోరితే జోక్యం చేసుకోలేం: షాహీన్​బాగ్​లో నిర్మాణాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీ విజ్ఞప్తి మేరకు ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అందుకు సుప్రీంకోర్టు వేదిక కాదని, కావాలంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని తీర్పు చెప్పింది.

"సీపీఐ(ఎం) ఎందుకు పిటిషన్ వేస్తోంది? ఏమైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందా? రాజకీయ పార్టీల కోరిక మేరకు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోలేం. కావాలంటే హైకోర్టుకు వెళ్లండి. వీధి వ్యాపారులు ఆక్రమిస్తే.. వాటిని తప్పకుండా తొలగిస్తారు. అక్రమంగా కట్టినా నా ఇళ్లును కూల్చి వేయకూడదని చెప్పే అధికారం ఎవరికీ లేదు" అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో సీపీఐ(ఎం) తన పిటిషన్​ను ఉపసంహరించుకుంది.

సీఏఏ నిరసనలు: ఎస్​డీఎంసీ సెంట్రల్​ జోన్ పరిధిలోకి వస్తుంది షాహీన్​బాగ్​. 2019, డిసెంబర్​లో జరిగిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు ప్రధాన కేంద్రంగా మారింది. కరోనా మహమ్మారి విజృంభించటం వల్ల 2020, మార్చిలో ఆందోళనలను విరమించారు షాహీన్​బాగ్​ ప్రజలు.

ఇదీ చూడండి: గుజరాత్​లోనూ బుల్డోజర్లు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కూల్చివేతలు

Last Updated :May 9, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.