ETV Bharat / bharat

'హైకోర్టుల్లో త్వరలోనే స్థానిక భాషల అమలు.. కానీ!'

author img

By

Published : Apr 23, 2022, 4:18 PM IST

CJI N V Ramana: దేశంలోని వివిధ హైకోర్డుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ. త్వరలోనే శాస్త్ర సృజనాత్మకత, కృత్రిమ మేధ ద్వారా అది సాధ్యమవుతుందని, కానీ, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెన్నైలో హైకోర్టు పరిపాలన భవన నిర్మాణానికి సీఎం స్టాలిన్​తో కలిసి శంకుస్థాపన చేశారు.

CJI N V Ramana
సీజేఐ ఎన్​వీ రమణ

CJI N V Ramana: హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడంలో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి సమీప భవిష్యత్తులో శాస్త్ర సృజనాత్మకత, కృత్రిమ మేధ ద్వారా పరిష్కారం లభించగలదని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విశ్వాసం వ్యక్తం చేశారు. చెన్నైలో హైకోర్టు పరిపాలనా భవన నిర్మాణానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మద్రాస్​ హైకోర్టులో తమిళ భాషను అనుమతించాలని సీఎం స్టాలిన్​ కోరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సీజేఐ.

CJI N V Ramana
శంకుస్థాపన చేస్తున్న సీజేఐ ఎన్​వీ రమణ, సీఎం స్టాలిన్​

"సంస్కృతి, భాషాపరమైన హక్కులను కాపాడటంలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348 ప్రకారం హైకోర్టుల్లో స్థానిక భాషల వినియోగంపై ఎప్పటికప్పుడు డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. న్యాయవ్యవస్థలను బలోపేతం చేయడం నా మొదటి ప్రాధాన్యత. న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న వివిధ అంశాలను ఏడాది పదవీ కాలంలో ప్రముఖంగా ప్రస్తావించాను."

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీజేఐ.

రాజ్యాంగ విలువలను పరిరక్షించడం న్యాయవ్యవస్థ విధి అని పేర్కొన్నారు సీజేఐ. అది పెద్ద భారం అనడంలో సందేహం లేదని, కానీ, తాము ప్రమాణం చేసిన రోజునే సంతోషంగా ఆ బాధ్యత తీసుకుంటామన్నారు. న్యాయ వ్యవస్థలను పటిష్ఠపరచటం తన తొలి ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు. చెన్నైపై ప్రశంసలు కురిపించారు జస్టిస్​ ఎన్​వీ రమణ. దేశానికి సాంస్కృతిక రాజధానిగా అభివర్ణించారు. ఇక్కడి ప్రజల జీవితాల్లో గొప్ప సంప్రదాయం, కళ, నిర్మాణం, నృత్యం, సంగీతం, సినిమా ఒక భాగంగా ఉన్నాయన్నారు. తమిళులు తమ గుర్తింపు, భాష, ఆహారం, సంస్కృతిని గర్వంగా భావిస్తారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మహిళా ఎస్సై గొంతుకోసిన దుండగుడు.. ఆ కోపంతోనే!

టీచర్ల నిర్వాకం.. విద్యార్థినులను బంధించి పాఠశాలకు తాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.