ETV Bharat / bharat

కేరళ స్టోరీపై రచ్చ.. యూపీలో ట్యాక్స్​ ఫ్రీ.. బంగాల్​లో బ్యాన్​.. నిర్మాతకు వార్నింగ్​!

author img

By

Published : May 9, 2023, 2:37 PM IST

Kerala Story Movie Controversy : 'ది కేరళ స్టోరీ' చిత్రం రాజకీయ రంగు పులుముకుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఈ చిత్రానికి మద్దతిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ చిత్రం సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. బంగాల్‌లో 'ది కేరళ స్టోరీ'పై నిషేధం విధించగా.. తమిళనాడులో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.

kerala story movie banned
kerala story movie banned

Kerala Story Movie Controversy : సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ చిత్రం' ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర ప్రదర్శనను కొన్నివర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు, ఇతర సిబ్బందికి గుర్తుతెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, మీరు మంచి పనులు చేయలేదని ఆగంతకుడు బెదిరించాడు. ఈ విషయాన్ని దర్శకుడు సుదీప్తో సేన్‌ ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవటం వల్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులకు మాత్రం పోలీసు భద్రత కల్పించారు.

'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని కొన్నిరాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఇప్పటికే పన్ను మినహాయింపు ఇవ్వగా.. తాజాగా ఉత్తర్​ప్రదేశ్‌లోని యోగి సర్కార్‌ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు 'ది కేరళ స్టోరీ' చిత్రంపై బంగాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చిత్రాన్ని నిషేధించిన తొలి రాష్ట్రంగా బంగాల్‌ నిలిచింది. ఈ సినిమా వక్రీకరించిన కథ అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చిత్రం విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని, శాంతిభద్రతలను కాపాడేందుకే చిత్ర ప్రదర్శనపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 'కశ్మీర్‌ ఫైల్స్‌' మాదిరిగా బంగాల్‌ కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్న మమతా బెనర్జీ.. దానికి భారతీయ జనతా పార్టీ ఫండింగ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు.
తమిళనాడులోనూ ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. కలెక్షన్లు తగ్గడం, థియేటర్ల వద్ద నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల సంఘం తెలిపింది.

'కేరళ స్టోరీ నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలి'
కేరళ స్టోరీ నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎన్​సీపీ నేత జితేంద్ర అవాద్​. కేరళ ఇమేజ్​నే కాకుండా.. మహిళలను కూడా అవమానించారని మండిపడ్డారు. మరోవైపు, కేరళ స్టోరీపై బంగాల్​ ప్రభుత్వం బ్యాన్​ విధించడాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్​ ఆఫ్ ఇండియా ఖండించింది. సెన్సార్​ బోర్డ్​ తప్ప మిగతా ఎవరికీ సినిమా విడుదలను అడ్డుకునే హక్కు లేదని చెప్పింది.

చిత్ర ప్రదర్శనపై స్టేకు సుప్రీం నిరాకరణ
'ది కేరళ స్టోరీ' చిత్ర ప్రదర్శనపై స్టే విధించడానికి మంగళవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 15న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ కేసును అత్యవసరంగా లిస్ట్‌ చేయాలని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందా అని ప్రశ్నించగా.. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించినట్లు సిబల్ తెలిపారు.
'ది కేరళ స్టోరీ' సినిమా ట్రైలర్‌లో ఓ వర్గానికి వ్యతిరేకంగా ఎలాంటి సన్నివేశాలు లేవని ఈనెల 5న కేరళ హైకోర్టు పేర్కొంది. సీబీఎఫ్‌సీ ఈ సినిమాను చూసి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చినట్లు తెలిపింది.

ఇవీ చదవండి : వంతెన పైనుంచి నదిలో పడిన బస్సు.. 22 మంది మృతి

మెహందీతో హైదరాబాద్​ టెకీ రికార్డ్.. 6 గంటల్లో 6 మీటర్ల వస్త్రంపై సీతారాముల బొమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.